శ్రీ శివ మహా పురాణము - 364


🌹 . శ్రీ శివ మహా పురాణము - 364 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

95. అధ్యాయము - 07

🌻. పార్వతి బాల్యము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా తేజస్వినియగు ఆమె అపుడు మేన యెదుట కుమార్తెయై జన్మించి లోకపు పోకడననుసరించి రోదించెను (1). ఓ మహర్షీ! ఆమె పరుండిన మంచము చుట్టూ వ్యాపించిన ఆమె యొక్క గొప్ప తేజస్సుచే, రాత్రియందు కూడా అచటి దీపములు వెనువెంటనే వెలవెలబోయినవి (2). ఇంటియందలి స్త్రీలందరు ఆమె ఏడ్చుటను వినిరి. ఆ ఏడుపు మనోహరముగ నుండెను. వారు తొందరగా అచటకు వచ్చి, ప్రేమతో ఆనందముతో పులకించిరి (3). అపుడు దేవ కార్యమును సిద్ధింపజేసే, సుఖకరము శుభకరమునగు ఆ పార్వతి పుట్టుటను గూర్చి హిమవంతుని అంతఃపుర పరిచారకుడు ఆ రాజునకు శీఘ్రమే తెలిపెను (4).

ఆ పర్వత రాజునకు కుమార్తె జన్మించినదను శుభవార్తను చెప్పిన ఆ అంతఃపురపరిచారకునకు తన శ్వేతచ్ఛత్రమును దానము చేయుట విడ్డూరమనిపించలేదు (5). ఆ శైలరాజు పురోహితునితో, బ్రాహ్మణులతో గూడి ఆనందముతో అచటకు వెళ్లి గొప్ప కాంతులతో శోభిల్లుచున్న ఆ కుమార్తెను చూచెను (6).

నల్లకలువ రేకుల వలె శ్యామలవర్ణము గలది, గొప్ప కాంతులతో మనస్సును రంజింపజేయునది అగు అట్టి కన్యను చూచి ఆ పర్వత రాజు మిక్కిలి ఆనందించెను (7). అచటనున్న పురుషులు, స్త్రీలు, అందరు పౌరులు కూడ ఆనందించిరి. అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. అనేక వాద్యములు మ్రోగించబడినవి (8).

మంగల గానములు పాడబడెను. వారాంగనలు నాట్యమును చేసిరి. హిమవంతుడు జాతకర్మను చేసి బ్రాహ్మణులకు దానమునిచ్చెను (9). అపుడు హిమవంతుడు సింహద్వారము వద్దకు వచ్చి, గొప్ప ఉత్సవమును చేసెను. ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై భిక్షుకులకు ధనము నిచ్చెను (10).

ఓ సుబుద్ధీ! హిమవంతుడు శుభముహూర్తమునందు మునులతో గూడి ఆమెకు కాళి మొదలగు సుఖకరమగు పేర్లను పెట్టెను (11). అపుడాయన మిక్కిలి ఆదరముతో బ్రాహ్మణులకు దానమునిచ్చెను. మరియు వివిధ గానకచేరిలతో గూడిన ఉత్సవమును చేయించెను (12).

ఆ హిమవంతుడు అనేక పుత్రులు గలవాడైననూభార్యతో గూడి ఈ తీరున పెద్ద ఉత్సవమును చేసి, ఆ కాళిని మరల మరల చూచుచూ, ఆనందమును పొందెను (13). సుందరమగు అంగములతో చూడ చక్కనైన ఆ దేవి అచట ప్రతి దినము సుందరమగు శుక్ల పక్షచంద్ర బింబము వలె పెరుగజొచ్చెను (14).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Feb 2021

No comments:

Post a Comment