మీరే సమీక్షించుకోవాలి


🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


ఏదో ఒకటి వెతికేందుకు, అన్వేషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి.

మీరు బాధను భరించలేరు. కాబట్టి, వెంటనే మీరు దానిని తరిమెయ్యాలి. లేకపోతే, అది భరించ లేనంతగా తయారై మిమ్మల్ని బానిసత్వపు బందిఖానాలోకి బలవంతంగా నెట్టేస్తుంది. అలా మీరు అతి త్వరలో ఏదో ఒక జైలులోకి ప్రవేశిస్తారు. అలా జరగక ముందు మీరు సృజనాత్మకమైన వ్యక్తిగా మారి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలి.

జీవితంలో మీకు ఏది ఆనందాన్నిస్తుందో, మీరు ఏది సృష్టించాలనుకుంటున్నారో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, జీవితానికి నిర్వచనం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోండి. అసలైన, ప్రామాణికమైన మీరేమిటో, మీ వ్యక్తిత్వమేమిటో తెలుసుకునేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశం.

మీ చుట్టూఉన్న ప్రపంచాన్ని మరి కాస్త మెరుగ్గా, మరింత సుందరంగా చెయ్యడంలో ఉన్న ఆనందం మీ జీవితాన్ని మరిన్ని ఒయాసిస్సులతో పచ్చదనాన్ని సంతరించుకున్న తోటగా మార్చి, అందులో అందరి కోసం మరిన్ని గులాబీలు వికసించేలా చేస్తుంది.

ఈ సందర్భంగా థియొసాఫికల్ సొసైటీని స్థాపించిన ‘‘మేడమ్ బ్లావట్‌స్కీ’’ నాకు గుర్తుకొస్తోంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక సంచీ నిండా పూలమొక్కల విత్తనాలుండేవి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నడిచే దారికి రెండు వైపులా ఆ విత్తనాలను చల్లేది. ‘‘ఎందుకలా చేస్తున్నారు?’’ అని అడిగిన వారితో ఆవిడ ‘‘అది నా అలవాటు. నేను మళ్ళీ ఈ దారిలో రాకపోవచ్చు.

కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. నేను చల్లిన విత్తనాలు మొక్కలై ఈ దారిలో వెళ్ళేవారికి వికసించిన రంగురంగుల పువ్వులతో స్వాగతం పలుకుతూ ఆనందం కలిగిస్తాయి. అలాగే వాటిలో కొన్ని పువ్వులు ప్రేమికుల బహుమతులు కావచ్చు. కొంతమంది పిల్లలు వాటిని కోసుకుని ఇంటికి తీసుకెళ్ళచ్చు లేదా వాటితో ఆడుకోవచ్చు.

అలా నేను ఎక్కడో ఒకచోట కొంత మందికి ఆనందం కలిగిస్తాను. నేనెవరో వారికి తెలియదు. అయినా పరవాలేదు. ఎందుకంటే, ఆ రకంగా నేను కొంతమంది ప్రేమలో, కొంతమంది ఆనందంలో వారికే తెలియకుండా భాగస్వామవుతాను. అదే నాకు ఆనందం’’ అనేది.

ఈ ప్రపంచాన్ని మరికాస్త సుందరంగా మరికాస్త చైతన్యవంతంగా చేసేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశమని అర్థం చేసుకునేవారికి ఎలాంటి బాధ ఉండదు. మీరు నన్ను ప్రశ్నించడం మంచికే జరిగింది. లేకపోతే ఆ బాధను మీరు భరించక తప్పదు. ప్రతికూల ధోరణి మెల్లమెల్లగా మీ స్వేచ్ఛను విషతుల్యం చేస్తుంది కాబట్టి అదృశ్యమై పోయే ప్రతికూల స్వేచ్చకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే దానికి ఉనికి లేదు. కాబట్టి స్వేచ్ఛ సానుకూలంగా మారాలి.

నిరంకుశత్వం నుంచి స్వదేశానికి స్వేచ్ఛ కలిగించడం సత్యమార్గాన్ని అన్వేషించడం సాధ్యమేనా? రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం మీరు చేసే సత్యాన్వేషణలు మరింత క్లిష్టమైన విషయాలుగా తయారైనప్పటికీ వాటి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు. ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసమే సాధన చేయాలి. ఎందుకంటే రాజకీయ నిరంకుశత్వాలు వస్తూ పోతూ ఉంటాయి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2021

No comments:

Post a Comment