వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది


🌹. వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

39


నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి.

మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలను పాటించాలని మీకు బాగా చిన్నప్పటి నుంచే బోధించారు. అందుకే మీకు స్వేచ్ఛ అంటే భయం. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ, బుద్ధి పెరగలేదు. అన్ని జంతువులకూ వయసు మాత్రమే పెరుగుతుంది కానీ, బుద్ధి పెరగదు. బుద్ధి పెరగడమంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.

దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని ఆది నుంచే మీకు బోధించారు. అందువల్ల మీరు ఆయన రక్షణ వలయంలో ఉన్నారనుకుంటారు. మీ లెక్కలు మీకుంటాయి. ‘‘ భయపడకండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి, ఆయనను తలచుకుంటూ పడుకోండి’’ అని చిన్న పిల్లలకు కూడా రాత్రి పడుకునే ముందు బోధిస్తారు.

మీకు వయసు పెరిగినా మీ పసితనంలో నాటిన ఆ భావన మీలో అలాగే ఉండిపోతుంది. కానీ, ఎవరూ మిమ్మల్ని రక్షించ వలసిన అవసరం లేదని, చీకటిలో కూడా మీరు హాయిగా పడుకోవచ్చని’’ నేనంటాను. అంటే ‘‘మీరు భయపడుతున్నారని, అందుకే మిమ్మల్ని రక్షించేందుకు ఎవరో ఒకరు కావాలని, లేకపోతే మీరు పడుకోలేరని’’ అర్థం. .

ఒకవేళ మీ రోగం కేవలం ఊహాత్మకమైతే- అలాంటి రోగులు మీ చుట్టూ అనేకమంది ఉంటారు. ఒక చిన్న విషయం చాలు, వారికే తెలియకుండా వారు దానిని పెద్దది చేస్తారు- దానికి ఊహాత్మకమైన మందు అవసరమవుతుంది. ఒక మాయ చెయ్యడమే వాటికి మందు. ‘‘దేవుడు’’ అలాంటి మందే.

నిశ్శబ్దంగా ఉండే అనంతమైన కటిక చీకటి చాలా అందంగా ఉంటుంది. వెలుగు వస్తుంది, పోతుంది. కానీ, చీకటి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది వెలుగుకన్నా ఎక్కువ శాశ్వతమైనది. వెలుగు కావాలంటే మీకు ఇంధనం అవసరం. కానీ, చీకటికి ఇంధనం అవసరం లేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ ఉండేదే. వెలుగు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల మీకు నిద్ర పట్టదు. విశ్రాంతి లభించదు. కాబట్టి, విశ్రాంతి కోసం వెలుగును ఎంచుకోవడం సరియైన పని కాదు. అసలైన విశ్రాంతి చీకటిలోనే లభిస్తుంది.

కాబట్టి, అందులోకే వెళ్ళండి. నిజానికి, చీకటిలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదు. అనవసరంగా ఆ విషయంలో మిమ్మల్ని భయపెట్టారు. అందుకే చీకటిలో మిమ్మల్ని రక్షించేందుకు ఆ దేవుడు మీకు అవసరమవుతాడు. ఒక అబద్ధానికి మరొక అబద్దం చెప్పాల్సి వస్తుంది. అలా మీరు అంతులేని అబద్ధాలు చెప్తూనే ఉంటారు.

స్వేచ్ఛ మిమ్మల్ని అనేక విషయాలలో కచ్చితంగా భయపెడుతుంది. కాబట్టి, ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని భయపెట్టే విషయాలపై లోతుగా దృష్టి సారించండి. వెంటనే వాటిపై మీకున్న భయం పోతుంది. మీరు భయపడేందుకు ఈ ప్రపంచంలో ఏదీ లేనప్పుడే మీరు స్వేచ్ఛగా ఆనందించగలరు, దాని బాధ్యతను స్వీకరించగలరు.

బాధ్యత మీరు ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందువల్ల మీరు ప్రతి పనిలో, ఆలోచనలో, భావనలో మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. అలా అది మీకు, మీ మనస్తత్వానికి ఉన్న బంధనాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని మరింత పారదర్శకంగా చేస్తుంది.

మీరు మీ భయాలను మరీ ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకే వాటినుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో అసలు వాటివైపే చూడకుండా వాటికి వ్యతిరేకమైన వాటిని మీరు సృష్టిస్తున్నారు. వెంటనే అవి వడగళ్ళలా కరిగిపోతూ తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. వాటి గురించి మీకు పూర్తి అవగాహన కలిగే సమయానికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. గుర్తుంచుకోండి.

మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా, వారి స్వేచ్ఛలో మనం జోక్యం చేసుకోకుండా, వారి సామర్థ్యం పూర్తిగా ఎదిగేందుకు మనం ఎలా సహాయపడగలం?

పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మనం ఎలా సహాయపడాలి? అని ఆలోచించడమే మీరు తప్పుదారిలో ఉన్నట్లు నిరూపిస్తోంది. అలా మీరు పిల్లలకు ఏది చెయ్యాలనుకున్నా అది కూడా మీకు కావలసిన రీతిలో మలచబడ్డ ప్రణాళికే అవుతుంది.

అది మీరు మీ పెద్దలనుంచి స్వీకరించిన నిబద్ధీకరణ ప్రణాళికకన్నా భిన్నమైనదే కావచ్చు, మీది సదుద్దేశమే కావచ్చు. ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2021

No comments:

Post a Comment