🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
అసలైన స్వేచ్ఛను తెలుసుకోవాలంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని కొద్దికొద్దిగా త్యజిస్తూ పోవాలి. మీరు శూద్రులు కాదు బ్రాహ్మణులని, మీరు మామూలు మనుషులు కాదు క్రైస్తవులనే విషయాలను మీరు పూర్తిగా మరచిపోవాలి. చివరికి మీ పేరు కూడా మీ వాస్తవం కాదని, అది కేవలం మిమ్మల్ని తెలిపేందుకు వినియోగించే సాధనం మాత్రమేనని, మీ జ్ఞానం కూడా అరువు తెచ్చుకున్నదే కానీ, మీ స్వానుభవంతో సంపాదించుకున్నది కాదని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే ‘‘అసలైన స్వేచ్ఛ’’అంటే ఏమిటో మీకు తెలుస్తుంది.
మీ లోలోపల చిన్న వెలుగు కూడా లేకుండా కటిక చీకటిలో మీరు జీవిస్తుంటే ప్రపంచమంతా ప్రకాశంతో నిండి ఉన్నా ప్రయోజనమేముంది? కాబట్టి, మీరు పుట్టిన తరువాత మీకు జోడించినదేదైనా మీ నిజ స్వరూపం కాదని తెలుసుకునేందుకు మీరు నిదానంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో మీ వ్యక్తిత్వం మెల్లమెల్లగా అదృశ్యమవుతుంది. వెంటనే మీరు సువిశాల వినీలాకాశాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, అస్తిత్వపు బాహ్య, అంతర్గతాలు ఎప్పుడూ సరిసమానంగా ఉంటాయి.
ఏదైతే మీ శరీరానికి మాత్రమే పరిమితమై ఉంటుందో అది మీ వ్యక్తిత్వం కాదు. మీ శరీరం దహనమైనా ఏదైతే దహనం కాకుండా ఉంటుందో అదే మీ అసలైన ఆత్మ. అందుకే కృష్ణుడు ‘‘ఏ అస్త్రము నన్ను ఛేదించజాలదు. అగ్ని దహించ జాలదు’’ అన్నాడు. అది నిజమే. కానీ, దహనమయ్యే శరీరము, మెదడు, వ్యక్తిత్వాల గురించి అతను మాట్లాడలేదు.
మీలో మరణం లేనిది, నాశనం కానిది, శాశ్వతమైనది ఏదో ఉంది. దాని గురించే అతను మాట్లాడుతున్నాడు. మీరు పుట్టకముందు, పుట్టిన తరువాత మీతో ఉండేదే అది. ఎందుకంటే, అదే మీరు అదే మీ ఉనికి.
అసలైన స్వేచ్ఛ గురించి మీకు తెలియాలంటే మీరు మీ శారీరక, మానసిక, బాహ్య బంధనాల నుంచి బయటపడాలి. మీరు మీ జీవితాన్ని అస్తిత్వమిచ్చిన బహుమతిగా భావించి ఆనందంతో పండగ చేసుకుంటూ హాయిగా జీవించండి. ఎండలో, వానలో, గాలిలో మీరు చెట్లతో ఆడుతూ, పాడుతూ, నాట్యం చెయ్యండి.
చెట్లకు, పక్షులకు, జంతువులకు, నక్షత్రాలకు ఎలాంటి ధర్మగ్రంథాలు లేవు. మరణించిన వారి పీడ వెంట పడడం కేవలం మనిషికే తప్ప వేరెవరికీ లేదు. ‘‘యుగయుగాలుగా, తరతరాలుగా మనిషి చేస్తున్న తప్పు అదే’’అని నేనంటున్నాను. వెంటనే దానిని పూర్తిగా ఆపవలసిన సమయం ఇదే, ఇప్పుడే.
సత్యాన్ని తెలుసుకునేందుకు, అన్వేషించేందుకు ప్రతి నూతన తరానికి అవకాశమివ్వండి. ఎందుకంటే, సత్యాన్వేషణ కన్నా సత్యాన్ని తెలుసుకోవడంలో ఆనందం తక్కువగా ఉంటుంది. అదే అసలైన తీర్థయాత్ర. అది దేవాలయానికి చేరుకుంటున్నట్లుగా ఉండదు. మీ పిల్లలు అణకువగా, బానిసలుగా ఉండేందుకు కాకుండా స్వేచ్ఛగా, గర్వపడేలా ఉండేందుకు మీరు సహాయపడండి. భావప్రకటనా స్వాతంత్య్రంతో స్వేచ్ఛగా జీవించడం కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని మీరు మీ పిల్లలకు బోధించండి. బానిసత్వాన్ని అంగీకరించడం కన్నా అవసరమైతే మరణించేందుకు సిద్ధపడేలా వారిని మీరు తయారుచేయండి.
కానీ, ఎక్కడా అలా జరగట్లేదు. అలా జరగనంత వరకు క్రూర నిరంకుశ, నియంతల- హిట్లర్లు, స్టాలిన్లు, మావోలు-వారి నుంచి ప్రపంచ మానవాళిని మీరు రక్షించ లేరు. నిజానికి, మీ జీవితాన్ని నియంత్రించే నియంతలను మీరు మీ అంతర్గతంలో కోరుకుంటున్నారు.
ఎందుకంటే, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటే మీరు అనేక తప్పులు చేస్తారు. అది సహజమే అయినా, అలా తప్పులు చెయ్యాలంటే మీకు చాలా భయం. కానీ, జీవితం అలాగే ఉంటుంది.
మీరు చాలా సార్లు కింద పడిపోతారు. అయినా పరవాలేదు. పైకి లేవండి. చాలా అప్రమత్తంగా ఉంటూ మళ్లీ అలా పడిపోకుండా ఎలాగో తెలుసుకోండి. మీరు తప్పులు చేస్తారు. కానీ, చేసిన తప్పులనే మళ్ళీ చెయ్యకండి. అప్పుడే మీరు తెలివైన వ్యక్తిగా ఎదుగుతారు. ఎప్పుడూ తక్కువ స్థాయిలో ఉండకుండా, మీరు చేరుకోగలిగినంత అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించండి.
ఇంకా వుంది...
🌹 🌹 🌹 🌹 🌹
05 Apr 2021
No comments:
Post a Comment