గీతోపనిషత్తు -193


🌹. గీతోపనిషత్తు -193 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 35 - 1

🍀 34. అభ్యాసము - అభ్యాసము, వైరాగ్యము అనునవి ఆత్మసాధనకు అత్యున్నతమైన సాధనములు. అభ్యాసము నిరంతరత్వమును ప్రసాదించును. అభ్యాసమనగా అంతరములు, అంతరాయములు లేక నిరంతరము కృషి సల్పుట. అభ్యాసమునకు శ్రద్ధ, నిరంతరత్వము ముఖ్యము. ఏ విషయము నేర్వవలెనన్నను, ప్రతిదినము అదే సమయమున అదే పని శ్రద్ధతో చేయుట వలన ఆ విషయము పై పట్టు చిక్కును. 🍀


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యా సేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్య తే || 35



అర్జునుని ప్రశ్నకు భగవానుడు చిరునవ్వుతో ఇట్లు సమాధానము చెప్పుచున్నాడు. “మహాబాహువులు గల ఓ అర్జునా! చంచలమైన మనస్సును నిగ్రహించుట చాల కష్టము. అది నిజము. సంశయము లేదు. కాని అభ్యాసము చేత, వైరాగ్యముచేత నిగ్రహించవచ్చును సుమా!" అభ్యాసము, వైరాగ్యము అనునవి ఆత్మసాధనకు అత్యున్నతమైన సాధనములు. అభ్యాసము నిరంతరత్వమును ప్రసాదించును.

అభ్యాసమనగా అంతరములు, అంతరాయములు లేక నిరంతరము కృషి సల్పుట. అట్లు సలిపినవారికి ఏ పనియైనను సిద్ధించును. అక్షరాభ్యాసము, అనగా అక్షరములను నిరంతరము అభ్యసించుట. అట్లభ్యసించిన వారికి అక్షరములు క్షుణ్ణముగ పలుకుట, వ్రాయుట తప్పక సిద్దించును. అట్లే విద్యాభ్యాసము కూడ. ప్రాధాన్యత విద్యకే నిచ్చి, నిరంతరముగ విద్య నభ్యసించి నపుడు తప్పక మేధస్సు ఉన్ముఖమై విద్య నభ్యసించుట జరుగును.

అదే విధముగ యోగాభ్యాసము కూడ సాగును. “అభ్యాసము కూసువిద్య" అను సూక్తి కలదు. దేనినైనను అభ్యసించుట ప్రారంభించినపుడు అది దుష్కరముగ గోచరించినను అభ్యాసవశమున సుళువు తెలియుట, అనాయాసముగ నిర్వర్తించుట కూడ జరుగగలదు.

ఉదాహరణకు ఎత్తైన ప్రదేశము లందు ఒక శిఖరము నుండి మరియొక శిఖరమునకు, లేక ఒక ధృవమునుండి మరియొక ధృవమునకు త్రాటిపై నడచుట సాధ్యమా! అభ్యాసవశమున సాధ్యపడును. అట్లే రెండు చక్రముల బండిపై (సైకిలు) సవారి చేయుట సాధ్యమా! అభ్యాసవశమున సాధ్యమే. ఇట్లెన్నో ఉదాహరణలు చెప్పవచ్చును. దుస్సాధ్యమగు విషయములు సాధ్యమగుటకు వినియోగపడు ఏకైక సాధనము అభ్యాసము.

అభ్యాసమునకు శ్రద్ధ, నిరంతరత్వము ముఖ్యము. ఏ విషయము నేర్వవలెనన్నను, ప్రతిదినము అదే సమయమున అదే పని శ్రద్ధతో చేయుట వలన ఆ విషయము పై పట్టు చిక్కును. వ్యాయామము కాని, ప్రాణాయామము కాని, ప్రార్థన కాని, ధ్యానము కాని అట్లే నిత్యము నిర్వర్తించుట వలన, మరియు శ్రద్ధతో నిర్వర్తించుట వలన సాధ్యమగును. శ్రద్ధ గలవానికే సిద్ధి. అశ్రద్ధ కలవాడు అసమర్థుడుగనే ఉండిపోవును.

అర్జునుడు సమర్థుడే గాని అసమర్థుడు కాదు గదా! అతనికి ఆ సమర్థత శ్రద్ధ వలనను అభ్యాసము వలనను కలిగినది. కనుకనే శాస్త్ర విద్యలన్నియు అతనికి సిద్ధించినవి. అట్టి శ్రద్ధను అంతర్జ్యాతి పై నిలిపినపుడు అభ్యాసవశమున అదియును సిద్ధించును. రుచి కలిగిన విషయము లందు జీవుడట్టి ఆసక్తియే చూపును.

కాఫీ, టీ వంటి పానీయములు, ఉపాహారము, భోజనము వంటి విషయములయందు రుచి ఉండుట వలనను గదా వాని నభ్యసించి, సిద్ధించుకొందురు. ఉదయముననే కాఫీ టీలు త్రాగవలె నని, ఫలహారము చేయవలెనని, భోజనాదికములు గావించ వలెనని ఎవ్వరును చెప్పకయే చేతురు. కారణము నిరంతరత్వమే. ఆ సమయమునకు గుర్తు వచ్చుట, రుచి కలిగి నిర్వర్తించుట జరుగుచున్నది గదా. అట్లే ప్రార్థనాదికములు గూడ నిర్వర్తించుట అభ్యసింపవలెను. రుచి, శ్రద్ధ నిరంతరత్వము వలన మానవుడు సాధింపలేనిది ఏదియును లేదు.

ప్రతినిత్యము కాఫీ ఫలహారముల వలెనే నిర్ణీత సమయమునకు ధ్యానము చేయవలెను. 11, 12, 13, 14వ శ్లోకములలో చెప్పిన రీతిని శరీరము, శిరస్సు, కంఠము తిన్నగ నిలపి, కదలక స్థిరముగ కూర్చుండి భ్రూమధ్యమును ప్రశాంతచిత్తుడై దర్శించుచు నుండవలెను. అచట నొక స్థిరమగు జ్యోతిని దర్శించుచు నుండవలెను. మనోభావము అచటి నుండి మరలినచో మరల జ్యోతి దర్శనమునకే ప్రయత్నించవలెను.

ఇట్లు నిత్యము ప్రయత్నము గావించినచో క్రమముగ మనస్సెచ్చట లగ్నము చేయబడెనో, అచ్చటనే యుండుట నేర్చును. ఇది మనస్సున కీయవలసిన శిక్షణ. అటునిటు తిరుగాడు జంతువునకు కూడ ఓర్పుతో శిక్షణ నిచ్చి నపుడు అది చెప్పిన చోట కూర్చుండును. విశ్రాంతికి ఒక ప్రదేశము, భుజించుట కొక ప్రదేశము, మలమూత్ర విసర్జనకు ఒక ప్రదేశము నేర్పినచో, జంతువులు సైతము వాటిని పాటించును.

కావున మానవ మనస్సునకు ఓర్పుతో శిక్షణ మిచ్చినచో తప్పక చంచల స్థితి నుండి అచంచల స్థితికి చేరవచ్చును. ఇందుకు వలసిన అంశములు ఆసక్తి, శ్రద్ధ, నిరంతరత్వము. అపుడే అభ్యాసము అగును. అట్టి అభ్యాసము వలన చంచలము, దుర్నిగ్రహము అగు మనస్సును. స్థిరపరచవచ్చును. ఇది అభ్యాసము. పై తెలిపిన అభ్యాసము సిద్ధించుటకు వైరాగ్యము కూడ నవసరము.

అందులకే భగవానుడు యుక్తమగు విహారము, ఆహారము తెలిపినాడు. అమిత భోజనము, ఉపవాసములు కూడ దని తెలిపినాడు. అతనిద్ర, అసలు నిద్ర లేకుండుట విసర్జించ వలెనని తెలిపినాడు. అనవసరమగు భాషణములు, తిరుగుడు విసర్జించవలెనని తెలిపినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 May 2021

No comments:

Post a Comment