🌹 . శ్రీ శివ మహా పురాణము - 393🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 18
🌻. కాముని విజృంభణము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
గర్వము గలవాడు, శివమాయచే వ్యామోహితుడు, మోహమును కలిగించువాడు నగు ఆ మన్మథుడచటికి వెళ్లి, మున్ముందుగా వసంతుని ప్రభావమును అచట విస్తరింప చేయ జొచ్చెను (1).
ఓ మహర్షీ! ఓషధిప్రస్థమునందు మహేశ్వరుడు తపస్సు చేయు స్థలములో సర్వత్రా వసంతుని ప్రభావము విస్తరిల్లెను (2). ఓ మహర్షీ! అచట వసంతుని ప్రభావముచే వనములోని చెట్లు అన్నియు విశేషించి వికసించినవి (3). మామిడి చెట్ల పూతలు, అశోక వృక్షముల పుష్పములు సుగంధమును వెదజల్లి మన్మథ వికారములను వృద్ధి పొందించునవై ప్రకాశించినవి (4).
తుమ్మెదలచే చుట్టు వారబడియున్న తెల్ల కలువలు విశేషించి మదనావేశమును కలిగింపజొచ్చెను (5). మిక్కలి రమ్యము, మనోహరము, అతి ప్రియమునగు కోకిలల మధుర కూజితములు కామావేశమును అధికము చేయజొచ్చెను (6). ఓ మహర్షీ! తుమ్మెదలు చేయు వివిధ ఝుం కారములు కూడ మనోహరముగ నుండి సర్వప్రాణుల మన్మథ వికారములను పెంపొందించెను (7). చంద్రుని తెల్లని వెన్నెల అంతటా వెదజల్లబడి యున్నది. ప్రియులకు, ప్రియురాండ్రకు మధ్య దూత కృత్యమును ఆ వెన్నెలయే నిర్వహించుచున్నదా యన్నట్లుండెను (8).
ఆ సమయములో కాల పురుషుని దీపము వలె నున్న వెన్నెల వ్యక్తుల అభిమానమును పారద్రోలి ప్రేమకు దారి చూపెను. ఓ మహర్షీ! విరహ తప్తులకు దుఃఖకరమగు వాయువు సుఖకరముగా వీచెను (9). అపుడచట ఈ తీరున మన్మథావేశమును కలిగించే వసంతుని విస్తారము వనమునందు నివసించే మునులకు అత్యంతము సహింప శక్యము కానిది ఆయెను (10). ఓ మహర్షీ! అపుడు జడపదార్థములకు కూడా కామమునందు ఆసక్తి కలిగినట్లుండెను. అట్టిచో చేతనులగు జీవులకు అట్టి ఆసక్తి కలిగినదని వర్ణింపనేల? (11) ఈ విధముగా సర్వప్రాణులలో కామమును ఉద్దీపనము చేయు ఆ వసంతుడు మిక్కిలి దుస్సహమగు తన ప్రభావమును విస్తరింపజేసెను (12).
వత్సా! తన లీలచే దేహమును స్వీకరించియున్న శివప్రభుడు అపుడు అకాలమునందు విజృంభించిన వసంతుని ప్రభావమును గని మిక్కలి ఆశ్చర్యమును పొందెను (13). లీలలను సృష్టించువాడు, జితేంద్రియుడు, సర్వ జగన్నియంత, దుఃఖములను బాపువాడు నగు శివ ప్రభుడు అచట మిక్కిలి దుస్సాధ్యమైన తపస్సును చేసెను (14). అచట ఇట్లు వసంతుడు విజృంభించగా, రతీదేవితో కూడియున్న మన్మథుడు చూత బాణమును ధనస్సుపై సంధించి ఆమె ఎడమ ప్రక్క నిలబడియుండెను (15). ఆతడు తన ప్రభావమును విస్తరింపజేసి, సర్వ మానవులను మోహింపజేసెను. అపుడు రతీ దేవితో ఆ విధముగా నున్న మన్మథుని చూచి మోహమును పొందని వారు ఎవ్వరు గలరు? (16)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 May 2021
No comments:
Post a Comment