✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 39
🍀 38. యోగ రసాయనము - శ్రద్ధ యున్నను నియతమగు మనసు లేనివాడు యోగమున ప్రవేశించినను అతడు యోగమును పొందలేడు. మానవుని యందు జమిలిగ పాశవికము, మానవికము, దైవికము అగు స్వభావములు కలసిపోయి ఉండును. పాశవిక భావముల నుండి సంస్కరించి మానవతా భావములను పెంపొందించి, దైవీ స్వభావమున స్థిరపడునట్లు చేయుట, తినలేని కందదుంపను రుచికరముగ భుజింప చేయుట యోగవిద్య చేయు మార్పు. 🍀
ఏతం మే సంశయం కృష్ణ ఛత్తు మర్ద స్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 39
అర్జునుడింకను పలుకుచున్నాడు. “ఈ నా సంశయమును శేషము లేకుండ ఛేదించుము. అట్లు ఛేదించుటకు నీకన్న అన్యు డెవరు లభింపగలడు?" శ్రద్ధ కలిగి యతచిత్తము లేనివాని గూర్చి అర్జునుడు ప్రశ్నించి నాడు. వాని పరిస్థితి ఏమగునని ప్రశ్న.
శ్రద్ధ యున్నను నియతమగు మనసు లేనివాడు యోగమున ప్రవేశించినను అతడు యోగమును పొందలేడు. అట్టివాని గతి ఏమి? యోగవిద్యలో ప్రవేశించి యోగ నియమములను పాటింపలేక, నియతమగు మనస్సును పొందలేక సతమతమగువా రెందరో వుందురు. ఉత్తర జన్మలలో వారికి ఏమగును? అటునిటు కాక దుఃఖపడునా? నశించునా?
యోగవిద్య ఒక రసాయనము విద్య వంటిది. యోగ సాధకుడు ఉన్నత స్థితి నుండి ఉత్తమ స్థితి కొరకై సాధనా మార్గమున యత్నించు చుండగ అతనిలో కొన్ని మార్పులు జరుగును. మార్పులు పూర్తిగాక అసంపూర్ణముగ జీవితము చాలించినచో ఏమి కాగలదు? వంటను ప్రారంభించి సగము వంట జరిగిన వెనుక వంట సాగనిచో వండబడుచున్న పదార్థ మేమగును? యోగవిద్యలో మానవుని పాశవిక స్వభావము హరింపబడును.
మానవ స్వభావము సంస్కరింపబడును. దైవీ స్వభావము ఆవిష్కరింపబడును. కంద మూలమును శుభ్రపరచి, తొక్కు తీసి, ఉడక పెట్టి, పోపు వేసి నపుడుగదా అది రుచికరముగ నుండును. లేనిచో తిను వానికి నాలుకతో ప్రారంభమై దేహమంతయు దురద కలుగును.
అట్లే మానవుని యందు జమిలిగ పాశవికము, మానవికము, దైవికము అగు స్వభావములు కలసిపోయి ఉండును. పాశవిక భావముల నుండి సంస్కరించి మానవతా భావములను పెంపొందించి, దైవీ స్వభావమున స్థిరపడునట్లు చేయుట, తినలేని కందదుంపను రుచికరముగ భుజింపచేయుట యోగవిద్య చేయు మార్పు.
అట్లే గొంగళిపురుగు తన చుట్టును గూడు కట్టుకొని 90 దినములలో సీతాకోకచిలుకగ మారును. గొంగళిపురుగు దేహముపై పాకిన కంపరము కలుగును. సీతాకోకచిలుక మేను పై వాలిన ఆహ్లాదము కలుగును. ఇట్టి రసాయనమే యోగవిద్య యందున్నది. ఈ రసాయన ప్రక్రియ సగములో ఆగినచో ఏమగునని అర్జునుని పరిప్రశ్నము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 May 2021
No comments:
Post a Comment