మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 26


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 26 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గురువు - చైతన్య స్వరూపము - 2 🌻


గురువును దైవముగా అనుసంధానము చేసి‌ ఆరాధించుటలో విశేషమున్నది. గురువు యొక్క రూపము-విద్య-ప్రశస్తి-యోగసాధనలో గడించిన అనుభవము- అపూర్వఘటనలు- వ్యక్తిత్వము -అభిభాషణమూ ఇవన్నీ తొలుత సహజంగా ఆకర్షిస్తాయి.

ఈ భౌతిక రూపము కొన్నాళ్ళో, కొన్నేళ్ళో దర్శనమిస్తున్నా, గురువులో వెలుగే క్రమంగా దర్శనమవ్వాలి. ఆ వెలుగే గురువు. అదే సాక్షాత్తు పరబ్రహ్మము.

కాగా గురూపాసన సాక్షాత్తు బ్రహ్మోపాసనమే అవుతుంది. ఆకార గుణవిశేషాదులు క్రమంగా ప్రక్కకు తొలగి వెలుగే గురువుగా సాధకునకు దర్శనమిస్తుంది.

మార్గం చూపుతుంది అపుడు గురువు శక్తివాహినిగానే అనుభవంలోకి వస్తుంటాడు. అతని ప్రతి చర్య, ప్రతి పలుకు కాంతి ప్రసార కేంద్రమే అవుతుంది.

నిత్యానుసంధానము మనస్సులో గురువే అయినపుడు- బ్రహ్మదర్శనమే అవుతున్న అనుభూతి కలుగుతుంది. ఆ స్థితిలో గురువునకు బ్రహ్మమునకు భేదమే కానరాదు.

యోగసాధనకు గురువే అధిష్ఠాన దైవము. గురుకటాక్షము ప్రసరించే కొలదీ‌ శిష్యునిలో చీకటులు మలగి ఆ మేరకు వెలుగు ఆక్రమిస్తుంది‌ భ్రమరకీట న్యాయంగా వెలుగును ఉపాసించే వాడు, తానే వెలుగు అవటం సహజపరిణామము. అద్భుతమేమీ కాదు.

రమణమహర్షి వంటివారు 'గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛ్చిన్న సంశయాః" అంటుండేవారు. పరమగురువుల మౌనమే శిష్యులకు సందేహ నివారణ చేస్తుంది. అయితే, అందుకు సంపూర్ణశరణాగతి సాధకునకు అవసరం.

గురువు యొక్క ఒక కృపావీక్షణం చేత, అద్భుతశక్తులు శిష్యులకు సంక్రమించిన ఘట్టాలూ లేకపోలేదు. అలనాటి శంకరాచార్యుల వారి‌‌ నుండి నేటి ఆధ్యాత్మిక గురువుల వరకూ ఎన్నో కథలు, గాధలు వింటూనే ఉన్నాము.

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2021

No comments:

Post a Comment