శ్రీ శివ మహా పురాణము - 398


🌹 . శ్రీ శివ మహా పురాణము - 398 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 19

🌻. కామదహనము - 3 🌻



దేవలిట్లు పలికిరి-

కొద్దిగా భస్మను తీసుకొని శ్రద్ధగా చేయుము. భయమును వీడుము. ఆ మన్మథుని శివుడు బ్రతికించగలడు. నీకు మరల ప్రియుడు దక్కగలడు (27). సుఖమును గాని దుఃఖమును గాని జీవునకు ఇతరులెవ్వరూ ఈయరు. సర్వప్రాణులు తమ కర్మఫలములను అనుభవించెదరు. నీవు వ్యర్థముగా దేవతలను నిందించుచున్నావు(28).


బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతలందరు రతిని ఈ విధముగా ఓదార్చి శివుని వద్దకు వెళ్లిరి. శివుని మిక్కిలి భక్తితో ప్రసన్నునిగా జేసి ఈ మాటలను పలికిరి (29).


దేవతలిట్లు పలికిరి-

హే భగవాన్‌! ప్రభో! మహేశ్వరా! నీవు శరణు జొచ్చిన వారిపై ప్రేమ గలవాడవు. దయతో మా ఈ శుభవచనమును వినుము. (30) హే శంకరా! మన్మథుడు చేసిన ఈ పనిని నీవు ప్రీతితో చక్కగా విచారించుము. మహేశ్వరా! కాముడు ఈ పనిని చేయుటలో ఆతని స్వార్థచింతన లేదు (31). హే విభో! నాథా! దుష్టుడగు తారకునిచే పీడింపబడిన దేవతలందరు కలసి ఈ వనిని ఆతని చేత చేయించినారు. ఓ శంకరా! నీవు మరియొక విధముగా తలంపవద్దు (32). హే దేవా! దుఃఖితురాలైన రతీదేవి ఏకాకినియై విలపించుచున్నది. హే కైలాసాధిపతీ! నీవు కూడ ఆమెను ఓదార్చుము (33).

హే శంకరా! నీవు ఈ క్రోధముతో సర్వమును సంహరింప బూనుకొంటివి. నీవు ఆ మన్మథుని సంహరించినచో, దేవతలతో సహా అందరినీ సంహరించినట్లే యగును (34). ఆ రతీదేవి యొక్క దుఃఖమును చూచి దేవతలు తామే నశించినట్లు భావించుచున్నారు. కావున నీవు కూడ రతీదేవి యొక్క శోకమును తొలగించవలసియున్నది (35).


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందరి యొక్క ఈ మాటలను విని ప్రసన్నుడై భగవాన్‌ శివుడిట్లు పలికెను (36).


శివుడిట్లు పలికెను-

దేవతలారా! ఋషులారా! మీరందరు నామాటను శ్రద్ధగా వినుడు. నా క్రోధముచే ఏది జరిగినదో అది అటులనే జరుగవలసి యున్నది. మరియొక విధానము లేదు (37). భూమి యందు కృష్ణుడు అవతరించి రుక్మిణిని చెట్టపట్టునంతవరకు రతీదేవి భర్తయగు కామ ప్రభుడు దేహము లేనివాడై ఉండుగాక! (38) కృష్ణుడు ద్వారకయందు నివసించి రుక్మిణి యందు సంతానమును పొందగలడు. వారిలో మన్మథుడు కూడ ఒకడై జన్మించగలడు (39). వానికి ప్రద్యుమ్నుడను పేరు ఉండును. దీనిలో సందేహము లేదు. ఆ బాలుడు పుట్టగానే శంబరుడు వానని అపహరించగలడు (40).

మూర్ఖుడగు శంబరాసురుడు ఆ బాలుని అపహరించి సముద్రములో పారవేసి మరణించినాడని భ్రమించి తన నగరమునకు వెళ్లగలడు (41). ఓ రతీ! నీవు అంతవరకు ఆ నగరమునందు సుఖముగా నుండుము. నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీకు అచటనే లభించగలడు (42). అచట కాముడు యుద్ధములో శంబరుని వధించగలడు. ప్రద్యుమ్నుడను పేరుతో ప్రసిద్ధి గాంచిన వాడై ఆతడు తన ప్రియురాలిని కలిసి సుఖించగలడు. ఓ దేవతలారా! (43). ఆతడు శంబరుని ధనమునంతనూ తీసుకొని రతీదేవి తోడు రాగా తన నగరమునకు వెళ్లగలడు. దేవతలారా! నా మాట సత్యము (44).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2021

No comments:

Post a Comment