✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 40
🍀 39. నిత్యజీవన యోగసాధన - పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యము లందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు. దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును. 🍀
పార్థ నై వేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40
పార్థా! అట్టి యోగభ్రష్టునకు ఈ లోకము నందు గాని, పరలోకము నందు గాని పతనముండదని తెలియుము. మంచి పని చేయుటకై సంకల్పించినవాడు దుర్గతి చెందనేరడు. ఈ విషయమున నీకు సందేహము వలదు. శ్రీ కృష్ణుడు ఒక విశేషమగు సృష్టి రహస్యము అర్జునునకు ఆవిష్కరించినాడు.
సత్సంకల్పముతో కార్యముల నారంభించు వారు కార్యములందు కృతకృత్యులు కాక పోయినను సంకల్పము శుభకర మగుటచే సృష్టియందు నాశనము చెందరు. అతడు కార్యము లందు నిపుణత లేక పోవుట వలన కొన్ని చిక్కు లేర్పరచు కొనినను, సంకల్పము దైవమును చేరు శుభ సంకల్పమే గనుక ఆ సంకల్ప మెరిగిన ప్రకృతి పురుషులు అతనిని ఆశీర్వదింతురే గాని, అతనిని భ్రష్టుని గావింపరు.
"కల్యాణ కృత్" అనగా కల్యాణము కలిగించు కార్యము. తనకు గాని, యితరులకు గాని చైతన్యపరమగు ఉన్నతిని గావించు కార్యము. చేయుటలో సమర్థతను బట్టి సిద్ధి యుండును. యోగవిద్యకు కావలసిన ఏకైక సమర్థత మనో నియతి. శ్రద్ధ కలిగినను మనోనియతి లేనిచో యోగము సిద్ధించుట జరుగదు.
వైఫల్యము కలిగినపుడెల్ల మరికొంత నియతిని యోగ సాధకుడు పొందుటకు యత్నించును. అట్లు యత్నింపవలెను కూడ. యత్నించుటకు కూడ వైఫల్యము లుండ వచ్చును. కాని మరల మరల యత్నించుటలో అభ్యాసవశమున యతీంద్రియుడు కాగలడు. యతచిత్తుడు కాగలడు. క్రమముగ అభ్యాసవశముననే సమబుద్ధిని పొందగలడు. శీతోష్ణములకు, సుఖదుఃఖములకు, మానావమానములకు తీవ్రమగు బాధ పొందుట క్రమముగ తగ్గును.
నిత్య జీవితమున అభ్యాసవశమున తగ్గునే కాని మరియొక మార్గము లేదు. నిత్య జీవితమున అనుభవ జ్ఞానము చేతను, అటు పైన అధ్యయన జ్ఞానము చేతను క్రమముగ కూటస్థుడగును కూటస్థుడగుట యనగ చంచలత్వము నుండి స్థిరత్వమునకు చేరినవాడు. అట్టివానికి సన్నివేశమును బట్టి వికారమగు మార్పులు కలుగవు. నిర్వికారుడు గనే యుండును.
దైనందిన జీవితమున కర్మజ్ఞాన సన్యాస యోగసూత్రము లను నిత్యము అనుసరించుట వలననే యతచిత్తము కలుగును గాని కేవలము పఠనము వలన గాని, ఉభయ సంధ్యలయందు సాధనవలన గాని పట్టు చిక్కదు. కనుకనే యోగసాధన నిత్య జీవితము నందు విలీనము కావలెను. యోగసాధన వేరుగను, నిత్యజీవితము వేరుగను నిర్వర్తించు వారికి యతచిత్తము లభించదు. యతచిత్తము లభింపనిదే యోగస్థితికి అవకాశము లేదు.
అందువలన నిత్యజీవన అభ్యాసముగ యోగము సాగ వలెను. శ్రద్ధ ఉండుటచే ఆ ప్రయత్నమున నున్నవాడు క్రమముగ వృద్ధి చెందును. నాశనము పొందడు. “కల్యాణ కృత్ కశ్చిత్ దుర్గతి గచ్ఛతి". కల్యాణమగు కర్మకు పూనుకొనువానికి దుర్గతి ఎట్లు కలుగును? కలుగుటకు వీలు లేదు. అట్టివానికి ఇహమునందు గాని, అటుపైన గాని వినాశము లేదు అని తెలియుము అనుచు కృష్ణుడు నిస్సందేహముగ తెలి పెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 May 2021
No comments:
Post a Comment