✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పరిస్థితులు - సాధన 🌻
సాధకుని జీవితమున వివిధానేక పరిస్థితులు తటస్థించుట తప్పనిసరి. సాధారణ మానవునికి ఎట్లో, సాధకునకు అంతియే. సాధకుడు తాను సాధారణ మానవుని కన్న విశిష్టుడనని భావించుట తప్పు.
భగవంతుని పొందవలెనని తపించి యోగసాధన చేయునట్టి చాలా మందిలో వికసించని దయ, శాంతము, ఓర్పు, ధైర్యము, వినయము వంటి సద్గుణములు, పెక్కుమంది మనము సాధారణ మానవులనుకొనువారిలో గమనింపదగును.
దీనికి కారణమేమి? భగవంతుని గూర్చి ఉద్వేగభరితములైన తపో, పూజా, సంకీర్తన, జప, హోమాది కార్యక్రమములు సాధకుడు చేపట్టవచ్చును. కాని అతనికి తల్లిదండ్రుల యందు వినయగౌరవములు లేకపోవచ్చును.
బాధలో ఉన్న దీనుని కన్నీటిని తొలగింపు దశలో అతడు తన వంతు కర్తవ్యమును నిర్ణయింపకపోవచ్చును. అతని దృష్టిలో భగవంతుని పొందుట అనగా ఒక వస్తువునో, వ్యక్తి యొక్క స్నేహమునో, అధికారమునో పొందుటవంటిది మాత్రమే.
మానవుని ప్రజ్ఞలో మూడు కక్ష్యలు గలవు. ఉద్వేగభరిత కక్ష్య ఒకటి. తార్కిక ప్రజ్ఞా కక్ష్య ఒకటి. దివ్య ప్రేమమయానుభూతి కక్ష్య ఒకటి.
తోటి వాడు రోగబాధతో ఏడ్చుచుండగా, కొందరు ఉద్వేగభరితులై తామును విలపింతురు. దాని వలన ఉపయోగము లేదు.
అట్లే మరికొందరు రోగార్తునకు సేవజేసిన మనకేమి లభించును అని తార్కికముగా ఆలోచింతురు మొదటి కక్ష్యలో జీవించువాడు భక్తుడుగా మనకు కనపడవచ్చును ఉదారహృదయుని వలె అనిపించవచ్చును.
రెండవ కక్ష్యలో జీవించువాడు మేధావి, పండితుడు, డిగ్రీలు కలవాడు, పెద్ద వైద్యుడుగనో, ప్లీడరుగనో, అధికారిగనో ప్రసిద్ధుడై ఉండవచ్చును. కాని వీరి వలన సంఘమునకు ఎట్టి ప్రయోజనము లేదు. రెండవ వాని వలన కీడు కూడ వాటిల్లవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
17 May 2021
No comments:
Post a Comment