శ్రీ శివ మహా పురాణము - 399


🌹 . శ్రీ శివ మహా పురాణము - 399🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 19

🌻. కామదహనము - 4 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని ఈ మాటలను విని దేవతలు మససులో కొంత ఓదార్పును పొందిన వారై శివునకు చేతులు జోడించి శిరసులను వంచి నమస్కరించిన వారై ఇట్లు పలికిరి (45).

దేవతలిట్లు పలికిరి-

ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! ప్రభూ! హరా! నీవు మన్ముథుని శీఘ్రముగా జీవింపజేసి రతీదేవి యొక్క ప్రాణములను కాపాడుము (46).

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవతల ఈ మాటలను విని ప్రసన్నుడైనట్టియు, కరుణాసముద్రుడు, సర్వేశ్వరుడునగు పరమేశ్వరుడు మరల ఇట్లు పలికెను (47).

శివుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! మిక్కిలి ప్రసన్నుడనైతిని. కాముని ఈ లోపులోననే జీవింపజేసెదను. కాముడు నా గణమై నిత్యము విహరించగలడు (48). ఓ దేవతలారా! ఈ వృత్తాంతమునెవ్వరికీ చెప్పకుడు. మీ స్థలములకు వెళ్లుడు. దుఃఖములనన్నిటినీ నశింపజేసెదను (49).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి అపుడు రుద్రుడు దేవతలు స్తుతించుచుండగా అంతర్థానమయ్యెను. దేవతలందరు మిక్కిలి ప్రసన్నులైరి. కాలగతికి చకితులైరి (50). ఓ మహర్షీ! అపుడు వారు ఆమెను ఓదార్చి రుద్రుని వచనమును స్వీకరించి తమలో తాము రుద్రుని మాటలను చెప్పుకొనుచూ తమ తమ ధామములకు వెళ్లిరి (51). ఓ మహర్షీ! కాముని భార్య యగు రతి రుద్రుడు ఆదేశించిన నగరమునకు వెళ్లి అచట రుద్రుడు ఆదేశించిన కాలము కొరకు ఎదురు చూచుచుండెను (52).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో కామనాశవర్ణనమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది(19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 May 2021

No comments:

Post a Comment