ఆదిశంకరుల వారు జన్మించిన పుణ్యదినం వైశాఖ శుద్ధ పంచమి. జగద్గురువు అనే మాటకి సంపూర్ణంగా తగినటువంటి వారు శంకర భగవత్పాదుల వారు. శంకరులను గ్రహించాలి అంటే ఒక నిర్మలమైన అంతఃకరణం ఉండాలి. వ్యాసుని అవతారం తర్వాత మళ్ళీ అంతటి అవతారం శంకరావతారమే.
ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగ మానవులకి జ్ఞానం అందించాలని చెప్పి వ్యాసుడు తాపత్రయ పడి వేదములను విభజన చేసే వేదాంత శాస్త్రమైన బ్రహ్మసూత్రాలను రచించి అటు తర్వాత అష్టాదశపురాణాలు అందించి మహాభారత ఇతిహాసాన్నిచ్చి తద్వారా భగవద్గీత, సనత్ సుజాతీయం మొదలైన బ్రహ్మవిద్యా గ్రంథాలను రచించి ఒక వ్యవస్థను చేశారు వ్యాసభగవానులు. కానీ కలిప్రభావం చేత ఉన్న వైదికమతం యొక్క హృదయాన్ని అర్థంచేసుకోలేక అందులో రకరకాల చీలికలు వచ్చి వైవిధ్యాన్ని వైరుధ్యం అనుకునే పద్ధతిలోకి వెళ్ళిపోయారు. అనేక అవైదికమతాలు పుట్టుకు వచ్చి ఆస్తికత అల్లల్లాడిపోతున్న రోజులవి.
ధార్మికత దెబ్బతిన్న రోజులవి, తాత్త్వికత సన్నగిల్లుతున్న రోజులవి. సనాతనధర్మం క్షీణదశకు వచ్చిన సమయంలో అవతరించిన సాక్షాత్ శంకరులే శంకరాచార్యుల వారు.
ఏకమేవ అద్వితీయం బ్రహ్మ’ - సృష్టిలో బ్రహ్మ తప్ప అన్యమేదీ లేదనీ, ‘సర్వం ఈశావాస్యం’- సకలచరాచరసృష్టి ఒకే దివ్య చైతన్యంతో నిండి నిబిడీకృతమై ఉన్నదనీ; భారతీయ వేదాంత విజ్ఞానాన్ని దేశం నలుమూలలా ప్రచారం చేసి, బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించిన వివేకరత్నం - ఆది శంకరాచార్యులు. ధర్మజిజ్ఞాసను, బ్రహ్మజిజ్ఞాసతో అనుసంధానం చేశారు. వేదప్రతిపాదిత ‘అద్వైత’తత్త్వం ప్రబోధించారు. జాతీయసమైక్యాన్ని పునరుద్ధరించి సనాతనధర్మరక్షణకోసం జగద్గురుపీఠాలను నెలకొల్పారు.
🌹 🌹 🌹 🌹 🌹
17 May 2021
No comments:
Post a Comment