గీతోపనిషత్తు -200


🌹. గీతోపనిషత్తు -200 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 41

🍀 40. యోగసిద్ధి - యోగము నందు సిద్ధి పొందని యోగసాధకుడు, యోగము నభ్యసించుచు యతచిత్తము లేకపోవుట వలన జారిన యోగ భ్రష్టుడు. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము, కర్మఫలత్యాగము, దానధర్మములు ఇత్యాది కార్యములు యోగజీవనమున నిర్వర్తించుట వలన చేసిన పుణ్యము కారణముగ మరణించిన పిదప యోగాభ్యాసి పుణ్యలోకములకే చనును. అటుపైన జన్మించును. మరల యోగవిద్య యందు ప్రవేశించుటకు, సాధన చేయుటకు వలసిన వాతావరణ మేర్పడును. యోగము ఈ కారణముగ అత్యుత్తమ విద్యగ తెలియదగును. 🍀

ప్రాప్య పుణ్యకృతాం లోకా సుషిత్వా శాశ్వతీ: సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ఠం జాయతే || 41

యోగము నందు సిద్ధి పొందని యోగసాధకుడు, యోగము నభ్యసించుచు యతచిత్తము లేకపోవుట వలన జారిన యోగ భ్రష్టుడు. యోగాభ్యాసి చేసిన అభ్యాసము ఇసుమంత అయినను అది ఉత్తర జన్మలలో శ్రేయస్సే కలిగించును గాని భ్రష్టత్వము కలిగించదు. చేసిన పుణ్యములను బట్టి, అనేక సంవత్సరములు పుణ్య లోకముల యందు వసించి తదుపరి పరిశుద్ధులైనట్టి శ్రీమంతుల గృహములలో మరల పుట్టును.

యోగాభ్యాసి చేసిన అభ్యాసము ఇసుమంత అయినను అది ఉత్తర జన్మలలో శ్రేయస్సే కలిగించును గాని భ్రష్టత్వము కలిగించ దని తెలుపుచు, అట్టివాడు యోగసిద్ధి పొందక గాని, యోగ భ్రష్టత్వము పొందిగాని మరణించినపుడు చేసిన పుణ్యములను బట్టి కొన్ని సంవత్సరములు పుణ్య లోకములందు వసించి అటు పైన శుచి, సంస్కారము గల శ్రీమంతుల కుటుంబములో పుట్టునని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు. దీనివలన యోగవిద్య యందు ప్రవేశించుట శ్రేయస్కరమని, ఉత్తమమని తెలియుచున్నది.

అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము, కర్మఫలత్యాగము, దానధర్మములు ఇత్యాది కార్యములు యోగజీవనమున నిర్వర్తించుట వలన చేసిన పుణ్యము కారణముగ మరణించిన పిదప యోగాభ్యాసి పుణ్యలోకములకే చనును. అటుపైన జన్మించును.

అట్టివానికి సత్సంపద కలిగిన గృహములందు జన్మ కలుగుట వలన చక్కని సంస్కారములు చిన్నతనము నుండి అబ్బును. సత్సంపద యుండుటచే దానధర్మాది గుణములు కూడ అలవడును. అన్నవస్త్రాదులకు లోటు ఉండదు గనుక ఉన్నత భావములపై జీవితమును కేంద్రీకరించు బుద్ధి కలుగును. మరల యోగవిద్య యందు ప్రవేశించుటకు, సాధన చేయుటకు వలసిన వాతావరణ మేర్పడును.

కుసంస్కార మున్నచోట అశుచి యుండును. సంపదలు లేనిచోట అన్నవస్త్రాదులే జీవితాశయములై, జీవిత మంతయు ధనార్జనమునకే కృషి సలుపవలసి యుండును. ఇట్టి పరిస్థితులలో యోగాభ్యాసము సాగదు. యోగాభ్యాసము సాగుటకు వలసిన వాతావరణము చిన్నతనముననే అందివచ్చుట అదృష్టము. అట్టి అదృష్టము పూర్వజన్మలయందలి యోగాభ్యాస ప్రయత్నముగ లభించును.

అందువలన యోగవిద్య నేర్చువాడు మరణించు సమయమున యోగసిద్ధి కలుగలేదని దుఃఖము చెంద నవసరము లేదు. యోగభ్రష్టుడనైతినని బాధ పడనవసరము లేదు. యోగము ఈ కారణముగ అత్యుత్తమ విద్యగ తెలియదగును. శ్రీకృష్ణుడు అర్జునుని "యోగీ భవ అర్జున” అనుచు అర్జునునిపై తనకు గల ప్రేమను చాటుకొనెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 May 2021

No comments:

Post a Comment