శ్రీ శివ మహా పురాణము - 400


🌹 . శ్రీ శివ మహా పురాణము - 400🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 20

🌻. బడబాగ్ని - 1 🌻


నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! శివుని నేత్రము నుండి పుట్టిన ఆ అగ్ని జ్వాల ఎక్కడకు పోయినది? చంద్రశేఖరుని ఆ వృత్తాంతమును నీవు చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంభుని మూడవ కన్నునుండి పుట్టిన అగ్ని కాముని శీఘ్రమే దహించి మరియొక ప్రయోజనము లేనిదై అంతటా వ్యాపించెను (2) స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో గొప్ప హాహాకారము బయలుదేరెను. వత్సా! దేవతలు, ఋషులు అందరు నన్ను శీఘ్రమే శరణుజొచ్చిరి (3). వారందరు భయభీతులై చేతులు జోడించి నాకు ప్రణమిల్లి తలలు వంచుకొని చక్కగా స్తుతించి వారికి కలిగిన అపత్తును నాకు నివేదించిరి (4). నేను వారి మాటలను విని, శివుని స్మరించి వారి దుఃఖమునకు గల కారణమును బాగుగా విమర్శించి. ముల్లోకములను రక్షించుట కొరకై వినయముతో నిండిన మనస్సు గలవాడనై అచటకు వెళ్లితిని (5).

జ్వాలల మాలలతో అతిశయించి ప్రకాశించే ఆ అగ్ని దహింపబోవుచుండగా, శంభుని అనుగ్రహముచే లభించిన గొప్ప తేజస్సు గల నేను శీఘ్రమే దానిని స్తంభింపజేసితిని (6). ఓ మహర్షీ! ముల్లోకములను తగులబెట్టగోరే ఆ క్రోధాగ్నిని నేను అపుడు సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖము గల బడబా (గుర్రము) అగ్నిగా మార్చివేసితిని (7). జగత్ప్రభువగు నేను లోకముల హితము కొరకై శివుని ఇచ్ఛచే ఆ బడబాగ్నిని తీసుకొని సముద్రము వద్దకు వెళ్లితిని (8). ఓ మహర్షీ! నా రాకను చూచిన సముద్రుడు పురుషరూపమును ధరించి చేతులు జోడించి నా సన్నిధికి విచ్చేసెను (9). అపుడా సముద్రుడు సర్వలోకములకు పితామహుడనగు నన్ను యథావిధిగా స్తుతించి నమస్కరించి పరమప్రీతితో నిట్లనెను (10).

సముద్రుడిట్లు పలికెను-

సర్వ జగత్పతీ! హే బ్రహ్మన్‌! నీవు ఇచటకు వచ్చుటలో గల కారణమేమి? నన్ను నీ సేవకునిగా భావించి ప్రీతితో నీ పనియందు నియోగించుము (11).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు నేను ప్రీతి పూర్వకముగా సముద్రుడు పలికిన పలుకులను విని లోకహితమును గోరువాడనై శంకరుని స్మరించి ఇట్లు పలికితిని (12). వత్సా! వినుము. నీవు గొప్ప బుద్ధిమంతుడవు. సర్వలోకములకు హితమును చేయువాడవు. ఓ సముద్రమా! హృదయములో శివుని ఇచ్ఛచే ప్రేరితుడనై ప్రీతితో నేను చెప్పుచున్నాను (13).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 May 2021

No comments:

Post a Comment