🌹. గీతోపనిషత్తు -204 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 45
*🍀 44. యోగ సంసిద్ధి - యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలందాసక్తి జనించుట కూడ తరింప బడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు. 🍀*
ప్రయత్నా ద్యతమానసు యోగీ సంశుద్ధ కిల్బిషః |
అనేకజన్మ సంసిద్ధ స్తతో యాతి పరాం గతిమ్ || 45
యత మానసుడై జన్మల తరబడి ప్రయత్నము చేయుచున్న యోగాభ్యాసి కిల్బిషము లన్నియు హరింపబడగ, సంశుద్ధుడై యోగ సంసిద్ధిని చెంది తరించును. శ్రీ కృష్ణుడు తెలుపుచున్న యోగవిద్య జీవులకు జన్మజన్మల అభ్యాసముగ సాగునని అంతకంతకును స్పష్టమగుచున్నది. క్రమ బద్దముగ నేర్చు యోగవిద్య సిద్ధించుటకు ఎన్ని సంవత్సరములు పట్టినను భయము లేదు. అభ్యాసము ఆరోహణ క్రమమున సాగవలెను.
యోగాభ్యాసము సాగుచుండగ జీవుని అంతఃకరణ బహిఃకరణములు పరిశుద్ధి చెందవలెను. వాని నడుమ సంయమ మేర్పడవలెను. కర్మ; కర్తవ్య కర్మమే కావలెను. కామ్యకర్మ కారాదు. కర్మలం దాసక్తి జనించుట కూడ తరింపబడవలెను. అహింస, ఆస్తేయము, అపరిగ్రహము ఆదిగా గల గుణములు సహజమై యుండవలెను. దానధర్మాదులు దినచర్యలో భాగమై పోవలయును. ఇష్టాయిష్టములు కరుగవలెను. ఇత్యాది అంశములు సిద్ధించుటకు జన్మలు పట్టుటలో ఆశ్చర్యము లేదు.
పతంజలి మహర్షి తెలిపిన యమ నియమ, ఆసన, ప్రాణాయామాది సూత్రములు, శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములు సిద్ధించుటకు కొన్ని జన్మల పరంపర సాగవచ్చును. కాని ఇవి యన్నియు యోగ మార్గమున సార్థకత నిచ్చునవి, సాఫల్యతను కలిగించునవే.
జీవుని స్వభావములో అనేకానేక జన్మ పరంపరల వాసన లుండును. అట్టి వాసన లన్నియు ఒక్కమారుగ పోవుటకు వీలు పడదు. క్రమ క్రమముగ శుభవాసన లేర్పడి అశుభ వాసనలు తొలగింపబడి జీవుడు ముందుకు సాగును. అతని యందలి భయము, కామము, క్రోధము, మోహ లోభములు, ఈర్ష్య అసూయలు, మదమాత్సర్యములు ఇత్యాది వాసనలను- యోగ సూత్రములను దీర్ఘకాలము అభ్యసించుట ద్వారా మాత్రమే నిర్మూలింప వచ్చును.
అభ్యాసము సాగుతున్నంత కాలము శుద్ధి ఏర్పడుచు నుండును. అశుద్ధి నుండి బయల్పడును. ఇట్లు సంయత్ శుద్ధిని చేరుసరికి సాధకుడు చాల దృఢచిత్తుడై తన మూలముతో యోగము చెందుటకు సంసిద్ధుడు కాగలడు. కనుక యోగము అనేక జన్మల సంసిద్ధి అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
No comments:
Post a Comment