🌹 . శ్రీ శివ మహా పురాణము - 403🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 21
🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 2 🌻
ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశమైననూ సుఖమును పొందజాలక, శివా! శివా! అని పలుకజొచ్చెను (16). వత్సా! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను (17).
దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను (18). ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి (19).
అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను (20). పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను (21).
ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి (22). ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి (23).
జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి (24).
నారదుడిట్లు పలికెను-
ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను (25). దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 May 2021
No comments:
Post a Comment