శ్రీ శివ మహా పురాణము - 404


🌹 . శ్రీ శివ మహా పురాణము - 404🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 21

🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 3 🌻


ఓ పార్వతీ! విరాగి, మహాయోగి, భక్తవత్సలుడునగు ఆ మహేశ్వర ప్రభుడు మన్మతుడు దహించి, నిన్ను విడిచిపెట్టి వెళ్లినాడు (27). కావున నీవు చిరకాలము గొప్ప తపస్సును చేసి ఈశ్వరుని ఆరాధించుము. తపస్సుచే పవిత్రురాలవగు నిన్ను ఆయన తన భార్యగా స్వీకరించగలడు (28).

నీవు ఏనాడైననూ శివశంకరుని వీడి యుండవు. ఓ దేవీ! నీవు శివుడు తక్క మరియొకనిని హఠాత్తుగా భర్తగా స్వీకరించుట జరుగబోదు (29). ఓ మహర్షీ! హిమవత్పుత్రిక యగు ఆ పార్వతి నీ ఈ మాటలను విని, చిన్న నిట్టూర్పును విడచి, ఆనందముతో చేతులెత్తి నమస్కరించి ఇట్లనెను (30).

పార్వతి ఇట్లు పలికెను-

హే ప్రభో! నీవు సర్వజ్ఞుడవు. జగత్తులకు ఉపకారమును చేయువాడవు. ఓ మహర్షీ! నేను రుద్రుని ఆరాధించుట కొరకై నాకు ఒక మంత్రము నిమ్ము (31). ఎవ్వరికైననూ సద్గురువు లేనిదే పుణ్యకర్మలేవియూ సిద్ధించవని నేను పూర్వము వినియున్నాను. సనాతనమగు వేదము ఈ సత్యము చెప్పుచున్నది (32).

ఓ మహర్షీ! ఆ పార్వతి యొక్క ఇట్టి పలుకులను విని నీవు శివ పంచాక్షరీ మంత్రమును ఆమెకు యథావిధిగా ఉపదేశించితివి (33). ఓ మునీ మరియు నీవు ఆమెకు ఆ మహామంత్రము యొక్క సర్వశ్రేష్ఠమగు మహిమను చెప్పి, ఆమె యందు దానిపై శ్రద్ధను కలిగించితివి (34).

నారదుడిట్లు పలికెను-

ఓ దేవీ! ఈ మంత్రము యొక్క పరమాశ్చర్యకరమగు మహిమను వినుము. శంకరుడీ మంత్రమును విన్నంత మాత్రాన మిక్కిలి ప్రసన్నుడగును (35). శంకరునకు అత్యంత ప్రీతిపాత్రమగు ఈ మంత్రము మంత్రములోకెల్లా గొప్పది. కోర్కెలను, భక్తిని, ముక్తిని ఇచ్చునది (36). ఓ సుందరీ! నీవు యథావిధిగా దీనిని జపించుము. శివుని ఆరాధించుము. శివుడు శీఘ్రముగానే నీకు ప్రత్యక్షము కాగలడు. ఇది నిశ్చయము (37).

ఓ పార్వతీ! నీవు నియమములను పాటిస్తూ, శివుని రూపమును స్మరిస్తూ ఈ పంచాక్షరీ మంత్రమును జపించుము. శివుడు శీఘ్రమే నీయందు ప్రసన్నుడు కాగలడు (38). ఓ సాధ్వీ! నీవీ తీరున తపస్సును చేయుము. మహేశ్వరుడు తపస్సుచే ప్రసన్నుడగును. సర్వప్రాణులు తపస్సు చేతనే ఫలమును పొందును, మరియొక ఉపాయము లేదు (39).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదా! శివునకు ఇష్టుడవగు నీవు అపుడా పార్వతితో ఇట్లు పలికి దేవతలకు హితమును చేయగోరి యథేచ్ఛగా స్వర్గమునకు వెళ్లియుంటివి (40). ఓ నారదా! అపుడా పార్వతి నీ మాటలను విని మిక్కిలి ప్రసన్నురాలై సర్వశ్రేష్ఠమగు పంచాక్షరీ మంత్రమును చేపట్టెను (41).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారదోపదేశమనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 May 2021

No comments:

Post a Comment