మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 32


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 32 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భాగవతము-అనుభూతి 🌻


కలియుగమున కష్టజీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.

పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు.

కావున, ధర్మము ‌కన్నా ధనము, అధికారము,‌ కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై‌ అల్పాయుష్కులగుట తప్పదు.

వీరికి కావలసినవి సుఖశాంతులు. కాని సుఖశాంతులను ఏ విషయమొసంగునో, ఇవి ఎట్లు లభించునో‌ వీరికి తెలియదు.

సుఖశాంతులను కలిగించునది దైవానుభూతి‌ ఒక్కటే. ఇట్టి అనుభూతికి‌ సులభము, తీయనైన బోధ యుండ వలయును. వేదాంత గ్రంధములకు‌ ఇట్టి సమర్థత లేదు.

ఇంద్రియముల ఆకర్షణకు లోనై‌ జీవించువారిని ఈ అనుభూతిని అందించుటకు‌ అంతకన్నా‌ గొప్పదయిన, మధురమయిన‌ ఆకర్షణ వైపు లాగవలెను. అందుకే నారదుడు వ్యాసునకు భాగవతమును ఉపదేశించి వ్రాయించెను...

🌹 🌹 🌹 🌹 🌹




28 May 2021

No comments:

Post a Comment