గీతోపనిషత్తు -203


🌹. గీతోపనిషత్తు -203 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 44

🍀 43. యోగాభ్యాస సంస్కారములు - పూర్వ యోగాభ్యాస సంస్కారములు జన్మ జన్మలకును బలపడుచుండగ, యోగాభ్యాసి తదభ్యాసవశముచే యోగవిద్య వైపునకు బలముగ ఈడ్వబడును. యోగ కారణమున జీవుడు క్రమబద్ధముగ తారణము చెందుచు కర్మ ఫలములను ఆశ్రయించక కర్మలను శుద్ధిగ నిర్వర్తించు స్థితికి చేరును. అతని ప్రవర్తనమున కర్మ జ్ఞాన సన్యాస యోగ సూత్రములు ప్రకటితమగు చుండును. అట్టివాడు కర్మలచే బంధింపబడడు. బంధము లేక కర్మలను నిర్వర్తించు చుండును. యోగ మార్గమున ఇట్టి స్థితికి చేరిన సాధకుడు, ఆత్మ సంయోగమునకు అతి చేరువలో నిలచును. ఇట్లు జన్మల తరబడి యోగవిద్యాభ్యాసము సాగును. 🍀

పూర్వాభ్యాసేన తేనైవ ప్రియతే హ్యవశోట పి సః |
జిజ్ఞాసు రపి యోగస్య శబ్ద బ్రహ్మాతివర్తతే || 44


క్రమముగ పూర్వ యోగాభ్యాస సంస్కారములు జన్మ జన్మలకును బలపడుచుండగ, యోగాభ్యాసి తదభ్యాసవశముచే యోగవిద్య వైపునకు బలముగ ఈడ్వబడును. అట్టి జిజ్ఞాసువు వేదోక్తమగు కర్మలను అప్రయత్నముగనే నిర్వర్తించును. కర్మ లంటని రీతిని ప్రవర్తించును. జన్మల తరబడి యోగాభ్యాసము చేసిన సాధకుడు క్రమముగ నిష్కామ కర్మయోగము నందు నిపుణుడై వర్తించును.

ఫలమందాసక్తి లేక, వక్రబుద్ధి లేక త్రికరణ శుద్ధిగ తనవంతు కర్తవ్యమునే నిర్వర్తించుట, ఇతర విషయముల జోలికి పోకుండుట, అట్టివానికి సహజ లక్షణమై యుండును. పరహితము, దాన ధర్మములు సహజ ముగ నుండును. ధ్యానము నందు ఆసక్తి మెండుగ నుండును. ఇష్టాయిష్టములు తీవ్రముగ నుండవు. వీనికి కారణము పూర్వ కృషియే.

పూర్వకృషియే ప్రస్తుతమున తదనుగుణమైన సిద్ధినిచ్చి మార్గము సుగమము చేయును. చిన్నతనము నుండియే తన ప్రవర్తనమునందు ఈ వైశిష్యము కన్పట్టుచుండును. అట్టివాడు
సంస్కారపరముగ వేదోక్త కర్మానుష్ఠానమును అతిక్రమించి యుండు నని శ్రీ కృష్ణుడు చెప్పుటలో అంతరార్థము పై తెలిపిన సత్యమే.

“శబ్ద బ్రహ్మ అతివర్తతే” అనగ వేదోక్త కర్మానుష్ఠానమును అతిక్రమించును అని అర్థము. ఇచట అతిక్రమణ మనగ దాటుట అని అర్థముగాని, నిర్లక్ష్యము చేయుట, నిర్వహింపకుండుట, వ్యతిరేకించుట కాదు. జీవకోట్లు ఫలముల నాశించి కర్మబద్ధత్వము కలిగి యుందురు. ఫలములకై వక్రగతులు అనుసరింతురు. పొందిన ఫలములందు మోహముచే తగులుకొని యుందురు. ఇట్లు అవిద్యావరణముననే జన్మ పరంపరలు సాగుచుండును.

యోగ కారణమున జీవుడు క్రమబద్ధముగ తారణము చెందుచు కర్మ ఫలములను ఆశ్రయించక కర్మలను శుద్ధిగ నిర్వర్తించు స్థితికి చేరును. అతని ప్రవర్తనమున కర్మ జ్ఞాన సన్యాస యోగ సూత్రములు ప్రకటితమగు చుండును. అట్టివాడు కర్మలచే బంధింపబడడు. బంధము లేక కర్మలను నిర్వర్తించు చుండును. యోగ మార్గమున ఇట్టి స్థితికి చేరిన సాధకుడు, ఆత్మ సంయోగమునకు అతి చేరువలో నిలచును. ఇట్లు జన్మల తరబడి యోగవిద్యాభ్యాసము సాగును. ఇట్టివాడు సాంఘిక సంప్రదాయ తీరములను కూడ దాటుట సున్నితముగ జరుగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 May 2021

No comments:

Post a Comment