✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 73. ప్రేమ 🌻
ఈ ప్రపంచమున ప్రేమ అరుదుగా గోచరించును. వ్యామోహము, మమకారము, పరస్పర అవసరములు ప్రేమగా తరచు వ్యక్తమగుచుండును. ఒకరిపై మరికొరిపై గల అవసరమును బట్టి ఆదుకొనెదరు. అవసరమునబట్టే ప్రేమ. కాని అవసరము లేకపోయినచో ప్రేమ లేదు. ప్రేమ పేరున ఒకరినొకరు బంధించుకొనుచుందురు. ఒకరిపై మరియొకరు ఆశలు పెంచు కొనుచుందురు. ఒకరి నుంచి మరియొకరు ఆశించెదరు. ఆశించినది లభించని యెడల ప్రేమ ద్వేషముగా మారుచుండును.
అదే విధముగా తనవారు మమకారభావము ప్రేమగా తారసిల్లుచుండును. నిజమైన ప్రేమకు తనవారు, పైవారు అని యుండదు. అట్టి ప్రేమ ఆశించదు, అడుగదు. ఆ ప్రేమయందు హెచ్చుతగ్గులు ఉండవు. ఆ ప్రేమకు అవసరములు ఉండవు. వ్యామోహము అంతకన్న ఉండదు. నిజమైన ప్రేమ అపరిమితము. కృతిమ ప్రేమ పరిమితము. నిజమైన ప్రేమ వికాసమునిచ్చును. కృతిమ ప్రేమ దుఃఖము నిచ్చును.
అహంకారి, మమకారి ప్రేమించలేరు. సమదృష్టి అను పదమునకు మరియొక పేరే ప్రేమ. నిజమగు ప్రేమ యందు ధర్మము, సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము ఇమిడి యుండును. కృతిమ ప్రేమ యందు పై గుణములు కానరావు. ప్రేమ ఆత్మతత్త్వమునకు సంబంధించినది. ఆత్మ నెరిగినవాడే నిజమైన ప్రేమికుడు. ఇతర ప్రేమలన్నియు చిల్లర ప్రేమలు. మనస్సుకు, బుద్ధికి కూడా అందని పరమపవిత్రమైనది ప్రేమ. ప్రేమ యున్నచోట కల్మషము ఉండదు. నిజమైన ప్రేమ తెలియవలెనన్నచో, అది మహాత్ముల జీవితమునందే కన్పపట్టును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 May 2021
No comments:
Post a Comment