శ్రీ శివ మహా పురాణము - 406


🌹 . శ్రీ శివ మహా పురాణము - 406 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఆ సఖురాండ్రిద్దరు ఇట్లు పలికి మిన్నకుండిరి. కాని భేదమును పొందిన మనస్సుగల ఆ మేన వారి మాటను అంగీకరించలేదు (15). అపుడా పార్వతి వినయముతో నిండిన మనస్సు గలదై శివుని పాద పద్మములను స్మరించి, తల్లికి చేతులు జోడించి నమస్కరించి స్వయముగా నిట్లు చెప్పెను (16).

పార్వతి ఇట్లు పలికెను-

తల్లీ! నేను మహేశ్వరుని పొందగోరి తపస్సును చేయుటకై ఉదయమే వెళ్లబోవుచున్నాను. తపస్సు కొరకై తపోవనమునకు వెళ్లుటకు నాకిప్పుడు అనుమతినిమ్ము (17).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేన కుమారై యొక్క ఈ మాటలను విని దుఃఖితురాలయ్యెను. ఆమె మనస్సు వికలమయ్యెను. ఆమె కుమారైను దగ్గరకు పిలిచి ఇట్లు పలికెను (18).

మేన ఇట్లు పలికెను-

హే శివే! పుత్రీ! పూర్వము తపస్సును చేసి దుఃఖమును పొందితివి. ఇపుడు ఇంటిలో నుండి తపస్సును చేయుము. పార్వతీ! బయటకు వెళ్లకుము (19).

నీవు తపస్సు చేయుట కొరకై ఎచటికి వెళ్లెదవు? నా ఇంటిలో దేవతలు గలరు. పుత్రీ! మొండితనమును వీడుము. బయటకు ఎచ్చటి కైననూ వెళ్లబనిలేదు. పూర్వము నీవు సాధించిన దేమి? భవిష్యత్తులో సాధించబోవునదేమి? ఇచటనే సర్వతీర్థములు, వివిధ క్షేత్రములు గలవు (20,21).

అమ్మాయీ! నీ శరీరము సుకుమారమైనది. తపస్సులో చాల క్లేశము గలదు. కావున నీవు ఇచటనే యుండి తపస్సును చేయుము. బయటకు వెళ్ళవద్దు (22). కోర్కెలను సిద్ధింపజేయుటకై స్త్రీలు తపోవనమునకు వెళ్లిరను మాటను ఇంతకుముందు విని యుండలేదు. ఓ పుత్రీ! కావున నీవు తపస్సు కొరకై వెళ్లు తలంపును చేయకుము (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా ఆ తల్లి తన కుమారైను అనేక తెరంగుల వారించెను. ఆమె మహేశ్వరుని ఆరాధించని ఆ స్థితిలో లేశ##మైననూ సుఖమును పొందలేకపోయెను (24). మేన ఆమెను తపస్సు కొరకై వనమునకు వెళ్లవద్దని నిషేదించుటచే (ఉమా=అమ్మాయీ! వద్దు) పార్వతికి ఉమా అని పేరు స్థిరమయ్యేను (25).

ఓ మహర్షీ! హిమవంతుని భార్యయగు ఉమ తన కుమారైయగు శివాదేవి దుఃఖించి యుండుటను గాంచెను. అపుడామె పార్వతికి తపస్సును చేయుటకై అనుమతినిచ్చెను (26). ఓ మహర్షీ! గొప్ప నిష్ఠగల పార్వతి తల్లి అనుమతిని పొంది శంకరుని స్మరించి తన అంతరంగములో సుఖమును పొందెను (27).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2021

No comments:

Post a Comment