దేవాపి మహర్షి బోధనలు - 93


🌹. దేవాపి మహర్షి బోధనలు - 93 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 74. ఉడకని మెతుకులు 🌻


నీవు నమ్మిన సద్గురువు రూపమును నీవు హృదయమున గాని, పాలభాగమునకాని దర్శించి, ధ్యానించుట ఒక ఉత్తమమైన సాధనా మార్గము. అహంకారులు ఈ విధముగ ధ్యానించలేరు. నీవు నమ్మిన సద్గురువు నీకు సమస్తమై యుండవలెను. అతని ముఖమును, ఆసీనుడైన అతని రూపమును నీవు ధ్యానమున స్పష్టముగ చూడ గలుగుట నీకెంతయూ మేలుచేయగలదు.

సద్గురువు నీ ముందుండి నిన్ను నడిపించెడి దివ్యజ్యోతి అని తెలియుము. అతని నుండి నీ
వెప్పటికప్పుడు నీ బుద్ధిని ప్రచోదనము కావించు కొనవచ్చును. అతని వెలుగు నీ చుట్టును ఒక వెలుగు ఆవరణ మేర్పరచి నిన్నెల్లప్పుడును పరిరక్షించుచుండును. నీ మనస్సున అతని భావములు మెదలవలె నన్నచో అతని ధ్యానమున నీవు నిలచి యుండుటయే సూత్రము.

అతని ననుసరించుట యనగా అతని భావముల ననుసరించుటయే. అనుకరణము వలన ప్రయోజము లేదు. సద్గురువుతో భావమయ లోకమున సహకారము నందవలె నన్నచో ఆయన రూపధ్యానము గావింపవలెను. దివ్యలోకములకు, నీకును మధ్య ఆయన వంతెనయై నిలబడి నీవు ఆయనతో కుదర్చుకొను మైత్రిని బట్టి నీకాలోకానుభూతిని ఆయన కలిగించగలడు.

నీ ద్వారా దివ్యకార్యములను నిర్వర్తించగలడు. నీ నుంచి పలుకగలడు. బోధన చేయగలడు. నీ ధ్యానమును బట్టి నీ సామీప్యమున నుండ గలడు. సాయుజ్యమును, సారూప్యమును కూడ ప్రసరించగలడు. సద్గురువు దొరికిన తరువాత కూడ నిరాకారమునే ధ్యానింతుమని భావించు వారు, వారి అహంకారము కారణముగ తిప్పలు పడుచుందురు. దైవము తన దూతగ గురువును పంపినపుడు గురువే దైవమని తెలియక, ఆయన యందు పరిపూర్ణ విశ్వాసముంచక, ఆయన అందించిన మార్గమున నడచువారు అహంకారులు. ఉడకని మెతుకుల వంటివారు. వీరికి పరిష్కారము, వారి అహంకారమును సద్గురువు పాదముల వద్ద సమర్పించుటయే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Jun 2021

No comments:

Post a Comment