దేవాపి మహర్షి బోధనలు - 96


🌹. దేవాపి మహర్షి బోధనలు - 96 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 77. నూతనత్వము 🌻


నిర్ణయమందలి వైవిధ్యమునందొక ఆనందము కలదు. వైవిధ్యము ఆనందహేతువు. క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అను సామెతలో సత్యమున్నది. తెలిపిన విషయమునే మరల తెలుపుచున్నను తెలుపు విధానమున క్రొత్తదన మున్నచో శ్రోత లానందింతురు. సృష్టియందీ క్రొత్తదనముండుట చేతనే ఆకర్షణీయ ముగ నుండును.

ప్రతి సూర్యోదయము, ప్రతి పౌర్ణమి, ప్రతి ఋతువు క్రొత్తగనే యుండును. వైవిధ్యము ఒక నూతనత్వమును కొని తెచ్చి ఆసక్తిని, ఆనందమును కలిగించును. అనుభవించు వారికి చిత్తశాంతి యగును. అట్లు క్రొత్త క్రొత్తగ బోధించుట సద్బోధకుని నైపుణ్యము.

అదే భోజనమైనను క్రొత్త క్రొగ వండినచో తినువారి కాసక్తి కలుగును. అవే వస్తువులైనను అమరికలో మార్పు చేయుటచే క్రొత్తదనముద్భవించును. ఈ రహస్యము తెలిసిన వైద్యుడు అవే మందులిచ్చుచున్నను, మాటలతో రోగిని ఉత్సాహపరచుచు అతని యందు ఆనందముద్భవింప చేయవలెను. ఆనందము కలిగించుట అసలైన వైద్యము. ఆనందించునపుడు శరీరగ్రంథులు చక్కగ స్రవించును. దేహమునకు వలసిన జీవసార ముద్భవించి స్వస్థత చేకూర్చును. ఆనందపరచువాడు నిజమైన ఆత్మీయుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jun 2021

No comments:

Post a Comment