దేవాపి మహర్షి బోధనలు - 107
🌹. దేవాపి మహర్షి బోధనలు - 107 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 88. మా అనుభవము 🌻
ఉరుములు, పిడుగులతో గాలివాన యున్నప్పుడు నీవటు నిటు నిదురలో పరుగిడుదువా? లేక కుదురుగ నొకచోట నుందువా? బుద్ధిమంతుడు అట్టి భీకర సన్నివేశములలో ఒక పంచను చేరి
తలదాచుకొనును కదా! అట్లే విపత్కర సన్నివేశములలో కూడ చెదరక హృదయమున చేరి సన్నివేశము దాటిపోవు వరకును లోన యుండ వలెను. విపత్కరమగు సన్నివేశములు జీవితమున ఎవరికి తప్పవు.
ఎంత చెట్టుకు అంతగాలి యున్నట్లు జీవి పన్నాను బట్టి అతనికొచ్చు కష్టనష్టములుండును. బాహ్యమున ఒడుదుడుకులు సహజము. అంతరంగమున అవి లేవు. చక్కని గృహమందు యున్నవానికి గాలి, వాన, ఉరుములు, మెరుపులు చూచుటలో ప్రకృతి గాంభీర్యము తెలియును. వానను చూచుచు ఆనందించును కూడ. లోనవున్న వానికే ఈ ఆనందము అందులకే "లోనికి పొమ్ము, శాంతిని, స్వస్థతను పొందుము.” అని మేము నిరంతరము ఘోషించుచుందుము.
ఇది చెవికెక్కక పోవుటయే నిజమగు కలి. అజ్ఞానము. జీవులు ఎన్నిన్నియో దైవకార్యములను, దైవారాధనమును గావించు చున్నారు. కాని వారికి శాంతి మాత్రము లేదు. కారణము చేయు కార్యములన్నియు బాహ్య సంబంధితములే. అంతర్గతము నందే నిజమగు హితమున్నది.
జీవితమున ప్రాథమిక దశలో అంతర్గత మగుట నేర్వవలెను. తాబేలును గురువుగ నుంచుకొని, ఇంద్రియముల వ్యాపారమునులోనికి త్రిప్పుట నేర్వవలెను. ఇందెంతయో హితమున్నది. విద్యాలయములందు ఇతరములైన విద్యలకన్న ఈ విద్యకు ప్రాధాన్య మందించినచో జీవులు పటిష్ఠమగు చేతన కలిగి సన్నివేశముల యందు చెదరని శాంతి కలిగియుందురు. ఇది చదువు పాఠకులు కూడ ఈ పని చేయరు. ఇది మా అనుభవము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
02 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment