గీతోపనిషత్తు -220


🌹. గీతోపనిషత్తు -220 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 8

🍀 7. అనుచింతనము - ఓ పార్థ! అనుచింతనము చేత, అభ్యాసము చేత, పరమ పురుషునితో ఎప్పుడును కూడియుండుట చేత ఇతర విషయములలోనికి మనస్సు చొరబడక దివ్యమగు పరమ పురుషునే పొంది, ఆ తత్త్యమును కూడియుండును. అనుచింతన వలన అన్యము లేని స్థితి కలుగును. కనుక అనుచింతనము అభ్యాసము చేయవలెను. అనుచింతనముననే యోగయుక్తత కలుగును. అనగా పరమ పురుషునితో కూడి యుండుట వీలు యగును. అట్టివాడు పరమ పురుషుని పొందుటకు అవకాశ మేర్పడును. 🍀

అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ II 8


తాత్పర్యము :

ఓ పార్థ! అనుచింతనము చేత, అభ్యాసము చేత, పరమ పురుషునితో ఎప్పుడును కూడియుండుట చేత ఇతర విషయములలోనికి మనస్సు చొరబడక దివ్యమగు పరమ పురుషునే పొంది, ఆ తత్త్యమును కూడియుండును.

వివరణము :

సత్ చిత్ ఆనంద తత్త్వము, పరము. ఆ తత్త్వమే విరాట్ పురుషుడుగ ఏర్పడియున్నాడు. అందువలన పరమ పురుషుడని, పురాణ పురుషుడని దైవమును కీర్తించుట ఆది నుండి యున్నది. అట్టి పరమ పురుష తత్త్వము నుండియే సృష్టి, సృష్టి జీవులు ఏర్పడి యున్నారు.

అందరియందు నిండి యున్నది ఆ తత్త్యమే. దేనిని చూచినను ప్రకృతి పురుషులే యథార్థమునకు కన్పించును. ఇతరములు కాంచుట భ్రాంతి. సమస్తమునందు కనబడుచున్నది, వినబడు చున్నది. స్పృశింప బడుచున్నది, రుచి చూడ బడుచున్నది, వాసనగ తెలియబడు చున్నది ప్రకృతి పురుషుల తత్త్వమే. కనుక సృష్టిని ప్రకృతి పురుషులుగ దర్శించుట వలన పరతత్త్వముతో యోగించుట ఆరంభ మగును.

అనగా కూడియుండుట ఆరంభమగును. ఇట్లు అభ్యాసము వలన యోగయుక్తత ఏర్పడును. అపుడు సాధకుని చేతస్సునకు ఇతర విషయములు గోచరించుట క్రమశః తగుచు, తత్త్య దర్శనము పెరుగుచు నుండును. అనగా పరమ పురుషుల దర్శనము జరుగుచు నుండును. సృష్టి సమస్తమును పరిశీలించుచున్న వారికి ప్రకృతి పురుషులే గోచరింతురు. ఇతరము గోచరించదు. అట్లు గోచరించుట వలన దానికి చేరువై పొందుట యుండును.

అనుచింతన వలన అన్యము లేని స్థితి కలుగును. కనుక అనుచింతనము అభ్యాసము చేయవలెను. అనుచింతనముననే యోగయుక్తత కలుగును. అనగా పరమ పురుషునితో కూడి యుండుట వీలు యగును. అట్టివాడు పరమ పురుషుని పొందుటకు అవకాశ మేర్పడును. ఈ శ్లోకమందు శ్రీకృష్ణుడు సూటిగ అక్షరమగు పరబ్రహ్మముతో కూడియుండు విధానమును తెలిపియున్నాడు. ముందు శ్లోకమున 'అనుస్మరణము' అని తెలిపినట్లే, ఈ శ్లోకమున 'అను చింతనము' అని తెలిపినాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jul 2021

No comments:

Post a Comment