🌹 . శ్రీ శివ మహా పురాణము - 420🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 24
🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 5 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు ఆతని మాటను విని అటులనే చేయుదమని అంగీకరించి, మిక్కిలి ప్రీతితో శంకరుని స్తుతించిరి (42). ఓ దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభో! శరణుజొచ్చిన మమ్ములను ఈ మహాదుఃఖము నుండి ఉద్ధరించి రక్షించుము (43). దేవతలు ఈ తీరున మిక్కలి దీనమగు పలుకులతో శంకరుని స్తుతించిరి. ప్రేమచే నిండిన మనస్సుగల ఆ దేవతలందరు చక్కని స్వరముతో రోదించిరి(44). విష్ణువు నాతో కలిసి పరమమభక్తితో కూడినవాడై మనస్సులో శంభుని స్మరించుచూ మిక్కిలి దీనముగా విన్నవించుకొనెను (45)
నేను, విష్ణువు మరియు దేవతలు ఈ తీరును పరిపరివిధములస్తుతించగా, మహేశ్వరుడు భక్తుల యందలి ప్రేమచే ధ్యానమును ఆపివేసెను (46). భక్తవత్సలుడు, పాపహారియగు శంకరుడు మిక్కలి ప్రసన్నమగు మనస్సు గలవాడై విష్ణువు మొదలగు దేవతలకు ఆనందము కల్గునట్లు దయాదృష్టితో చూచి ఇట్లు పలికెను (47).
శంకరుడిట్లు పలికెను-
ఓ బ్రహ్మా! హే విష్ణో! ఇంద్రాది దేవతలారా! మీరందరు ఒక్కసారి ఇచటకు వచ్చుటకు కారణమేమి? నా ఎదుట సత్యమును పలుకుడు (48).
విష్ణువు ఇట్లు పలికెను-
ఓ మహేశ్వరా! నీవు సర్వజ్ఞుడవు. అంతర్యామివి. సర్వేశ్వరుడవు. మా మనస్సులోని మాట నీకు తెలియదా? అయిననూ, నీ శాసనముచే చెప్పుచున్నాను (49). హే మృడా! మాకందరికీ తారకాసురుని వలన అనేక రకముల దుఃఖము సంప్రాప్తమైనది. ఇందువలననే దేవతలు నిన్ను స్తుతించి ప్రసన్నునిగా చేసుకొనిరి (50). ఉమా దేవి నీకొరకై హిమవంతుని కుమార్తెగా జన్మించియున్నది. ఆమె యందు నీకు కలిగే పుత్రునిచే మాత్రమే ఆ తారకుడు సంహరింప బడును. దీనికి మరియొక ఉపాయము లేదు (51). బ్రహ్మ అతనికి ఇట్టి వరమును ఇచ్చియున్నాడు. కావున ఇతరుల చేతిలో ఆతనికి చావు లేదు. ఆతడు జగత్తు నంతనూ పీడించుచున్నాడు (52).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Jul 2021
No comments:
Post a Comment