మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 48
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 48 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 1 🌻
జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు. వీరు కాలస్వరూపుడగు వాసుదేవుని మంద్రజాలంలో పరవశిస్తుంటారు.
ఇట్టి వారి ద్వారా వాసుదేవుడు తన సాన్నిధ్యాన్ని వ్యక్తం చేయడంతో, వీరిని చేరినవారికి ఆనందం, శాంతి కలుగుతాయి. ఇదియే సత్యం కాని, మొత్తం లోకంతా ఒక్కసారిగా విష్ణుధర్మావలంబులు కావడం జరుగదు.
అసలు తనను తానే ఉద్ధరించుకోలేని నరుడు లోకాన్ని ఉద్ధరిస్తాననడం పిచ్చిమాత్రమే. ఆ దృక్పథమే రోగ గ్రస్తమగు మనోవైఖరి.
జీవులకు యోగక్షేమాలను ప్రసాదించేది వారి వారి కర్మలను బట్టి వాసుదేవుడే కాని ఇంకెవరూ కాదు. మనం చేయవలసినది, అందులకే ఆ స్వామిని ప్రార్థిస్తూ, ఆర్తులగు జీవులకు మనవంతు సేవనందించడమే.
ఆ దిశలో తమ ద్వారా ఈ పని అవడమే కాని, తమ వలన కాదని మరచిపోరాదు. తమ ద్వారా వాసుదేవుడు ఎంత, ఏ విధంగా చేయ సంకల్పిస్తాడో అదే జరుగుతుంది.
అపుడు లోకకల్యాణానికై మనం చేసే సేవ అంతర్యామి ఆరాధనమై, వానికి ప్రీతి గొల్పుతుంది. మనల్ని ఉద్ధరిస్తుంది.
అవతారమూర్తులే లోకకల్యాణమునకై తమ వంతు కర్తవ్యాన్ని మాత్రమే ఆచరించామని తృప్తిగా భావించారు. కావున తేలినదేమనగా లోకోద్ధరణ భావము బంధము.
లోకకల్యాణమునకై కర్తవ్యాచరణము మోక్షము, మనకుఆదర్శము. ఇందు మనం నిలబడేట్లు మన గురువులు మనలను ఆశీర్వదింతురు గాక...
🌹 🌹 🌹 🌹 🌹
01 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment