గీతోపనిషత్తు -222


🌹. గీతోపనిషత్తు -222 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 10 - 1

🍀 9-1 . ధ్యాన మార్గము - అచలము, స్థిరము అగు మనస్సుతో ప్రాణాయామ మార్గమున హృదయమును, అచటి నుండి భ్రూమధ్యమును చేరి అచట పై తెలిసిన పరతత్త్వముతో కూడియుండుట నిత్యము ప్రయత్నింప వలెను. ధ్యాన సమయమున, నిద్రకు పూను కొనిన సమయమున, శరీరము విసర్జించు సమయమున నిర్వర్తించిన వారికి పరతత్త్వము లభ్యమగును. నిత్య ధ్యానమునను, నిద్ర కుపక్రమించు సమయమునను, ప్రజ్ఞ భ్రూమధ్యమున నిలుపు ప్రయత్నము అభ్యసింపని వారు మరణ సమయమున, ప్రజ్ఞను భ్రూమధ్యమున నిలుపలేరు.🍀

ప్రయాణకాలే మనసా చలేవ భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
ధ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్ సతం పరం పురుష ము పైతి దివ్యమ్ || 10


తాత్పర్యము :

అచలము, స్థిరము అగు మనస్సుతో ప్రాణాయామ మార్గమున హృదయమును, అచటినుండి భ్రూమధ్య మును చేరి అచట పై తెలిసిన పరతత్త్వముతో కూడియుండుట నిత్యము ప్రయత్నింప వలెను. ధ్యాన సమయమున, నిద్రకు పూను కొనిన సమయమున, శరీరము విసర్జించు సమయమున నిర్వర్తించిన వారికి పరతత్త్వము లభ్యమగును.

వివరణము :

ఈ శ్లోకమున ప్రయాణకాల మనగా దానిని మూడు విధములుగ గుర్తింపవచ్చును. ఒకటి మరణించు సమయము. రెండు నిద్ర కుపక్రమించు సమయము. మూడు ధ్యాన సమయము. ఈ మూడును సూక్ష్మలోక ప్రయాణమునకే ఉద్దేశింపబడినవి.

కనుక ప్రధానముగ ధ్యానము చేయునపుడెల్ల భ్రూమధ్యమున ధ్యానము చేయుటకై ప్రయత్నింప వలెను. నిద్ర కుపక్రమించు నపుడు కూడ తీరువుగ తూర్పు ముఖముగ గాని, ఉత్తర ముఖముగ గాని, పశ్చిమ ముఖముగ గాని పడుకొని ఈ క్రింద తెలుపబడు విధానమున ను భ్రూమధ్యమున చేర్చ వలెను. మరణ మాసన్నమైనపుడు కూడ ప్రజ్ఞ భ్రూమధ్యముననే యుండవలెను.

నిత్య ధ్యానమునను, నిద్ర కుపక్రమించు సమయమునను, ప్రజ్ఞ భ్రూమధ్యమున నిలుపు ప్రయత్నము అభ్యసింపని వారు మరణ సమయమున, ప్రజ్ఞను భ్రూమధ్యమున నిలుపలేరు. కనుక అనునిత్యమీ ప్రయత్నము సాగుచు నుండవలెను. అట్ల భ్యసించిన వారికి మరణ సమయమున కూడ అభ్యాసవశమున భ్రూమధ్యమున చేరుట సులభమగును. అప్పటి కప్పుడు తెలిపినను అభ్యాసలేమి కారణముగ ఈ స్థితి సాధ్యపడదు. మరణ సమయమున జీవుడు అనాయాసముగ దేహము నుండి విడిపడుటకు ఇది ఒక్కటియే మార్గము.

ఇట్లభ్యాసము నిర్వర్తించువారు ముఖము నుండి ప్రాణమును విడుతురు. ముఖద్వారమున ప్రాణమును విడుచుట ఉత్తమలోక ప్రాప్తికి సంకేతము. ఈ శ్లోకమున తెలుపబడిన ధ్యానవిధానము ఆత్మజ్ఞానమునకు, పరలోకప్రాప్తికి, పరమపదమును చేరుటకు మార్గముగ చూపబడినది. దివ్యము, పరము అగు స్థితిని పురుషుడు చేరుట కిదియే మార్గమని తెలుపబడినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jul 2021

No comments:

Post a Comment