శ్రీ శివ మహా పురాణము - 423


🌹 . శ్రీ శివ మహా పురాణము - 423🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 24

🌻. దేవతలు శివునితో మొరపెట్టుకొనుట - 8 🌻

నేను అనేక పర్యాయములు అధిక ప్రయత్నమును చేసి భక్తుల కొరకై కష్టమును సహించితి. నేను గృహపతినై విశ్వానరమహర్షి యొక్క దుఃఖమును తొలగించితిని (71). ఓ బ్రహ్మా! హే విష్ణో! పెక్కు మాటలేల? నేను సత్యమును పలుకుచున్నాను. నేను ప్రతిజ్ఞను చేసితినని మీరందరు ఎరుంగుదురు. ఆ ప్రతిజ్ఞ యొక్క తత్త్వము మీకు తెలియును (72).

ఎప్పుడైననూ ఎక్కడైననూ భక్తులకుకష్టము వచ్చినచో, నేను అప్పుడు అక్కడ వెంటనే ప్రత్యక్షమై ఆ కష్టమును తొలగించెదను (73). మీకు అందరికీ తారకాసురుని వలన సంప్రాప్తమైన దుఃఖమును గురించి నేను ఎరుంగుదును. నేనా దుఃఖమును తొలగించెదను. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (74).

నాకు భోగవిలాసముల యందు అభిరుచి లేకపోయిననూ, పుత్ర సంతానము కొరకై పార్వతిని వివాహమాడెదను (75). దేవతలారా! మీరందరు నిర్భయముగా మీ గృహములకు వెళ్లుడు. మీ కార్యమును నేను సిద్ధింపజేసెదను. మీరీ విషయములో విచారించకుడు (76).

బ్రహ్మ ఇట్లు పలికెను -

శివుడు ఇట్లు పలికి మౌనమును వహించి సమాధిలోనికి వెళ్లిపోయెను. ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలందరు తమ ధామములకు వెళ్లిరి (77).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ వివాహ స్వీకారమనే ఇరువది నాలుగవ అధ్యాయము ముగిసినది (24).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Jul 2021

No comments:

Post a Comment