గీతోపనిషత్తు -238
🌹. గీతోపనిషత్తు -238 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚
శ్లోకము 19-1
🍀 18-1. నిద్ర - మెలకువ - ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట అనంతముగ జరుగుచున్నది. 🍀
భూత గ్రామ స్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే2 వశః పార్థ ప్రభవ త్యహరాగమే || 19
తాత్పర్యము : ప్రాణి సమూహము లన్నియు కూడ పరాధీనమై పగటి యందు మేల్కొని, వర్తించి మరల పరాధీనమై రాత్రియందు నిదురలోనికి చనుచున్నవి. బ్రహ్మపగలు యందు కూడ ప్రాణి సమూహము అట్లే అవశులై పుట్టుచు చచ్చుచు, మరల పుట్టుచు జీవించి బ్రహ్మరాత్రి యందు లయమందు చున్నది.
వివరణము : బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి సుదీర్ఘ కాల పరిమాణము. అందు బ్రహ్మపగలు యందు జీవులు లక్షలాది జన్మలెత్తుచు నుందురు. అందు మానవులు కలియుగమున వంద సంవత్సరముల ఆయుఃపరిమాణము గలవారు. వారు పుట్టి, పెరిగి, జీవించి, మరల చనిపోవుచు యుందురు. ఈ మానవ జన్మ పరిమాణము వంద సంవత్సరములు.
జన్మించి మరణించు లోపల అనేకమార్లు నిద్రలోనికి చనుట, మరల మెలకువలోనికి వచ్చుట జరుగుచుండును. ప్రతి మెలకువ మరియొక నిద్రవరకే. ప్రతి జననము రాబోవు మరణము వరకే. ప్రతి బ్రహ్మపగలు, బ్రహ్మరాత్రి వరకే. అట్లే ప్రతి సృష్టి మరల లయము వరకు. లయము చెందిన సృష్టి మరల పుట్టును. బ్రహ్మరాత్రికి మరల పగలేర్పడును. ప్రతి మరణించిన జీవికి మరల పుట్టుక ఏర్పడును. నిద్రించిన ప్రతి జీవి మరల మేల్కాంచును. కాల పరిమాణము చిన్నదియైనను పెద్దదియైనను, మేల్కాంచుట నిద్రించుట గోచరించుచునే యున్నది.
మేల్కాంచుట యనగా అవ్యక్తము నుండి వ్యక్తము లోనికి వచ్చుట. నిద్రించుట యనగా వ్యక్తము నుండి అవ్యక్తము లోనికి చనుట. వ్యక్తము నందు జ్ఞానము కలుగుట, అవ్యక్తమున జ్ఞానము కోల్పోవుట, మరల వ్యక్తమున జ్ఞానము కలుగుట జీవులకు ఒక దినమునందు, ఒక జనన మరణమందు, ఒక బ్రహ్మ పగలు రాత్రియందు, ఒక సృష్టి ఆరంభ అంతము లందు అనంతముగ జరుగుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment