శ్రీ శివ మహా పురాణము - 437


🌹 . శ్రీ శివ మహా పురాణము - 437🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 4 🌻


బ్రాహ్మణుడిట్లు పలికెను-

ఆయన వద్ద ధనమున్నచో దిగంబరుడై ఉండనేల? ఎద్దు ఆయనకు వాహనము. ఆయన వద్ద సామగ్రి ఏమియూ లేదు (31). వరులయందలి ఏయే గుణములు స్త్రీలకు సుఖమునిచ్చునవి చెప్పబడినవో, వాటిలో ఒక్క గుణమైననూ ఆ ముక్కంటి యందు లేదు (32). నీకు అప్తుడగు మన్మథుని ఆ హరుడు దహించివేసినాడు. మరియు ఆయన చూపిన అనాదరమును నీవు ఎరుగుదువు. ఆయన నిన్ను విడిచి ఎక్కడికో వెళ్లినాడు (33).

ఆయనకు జాతిగాని, విద్యగాని జ్ఞానముగాని ఉన్నట్లు కానరాదు. ఆయనకు పిశాచములు తోడు కంఠములో విషము స్పష్టముగా కనబడుచుండును (34). ఆయన సర్వదా ఒంటరిగా నుండును. ఆయన నిత్యవైరాగ్యము దృఢముగా గలవాడు. కావున నీవు శివుని మనస్సులో కోరుకొనుట ఎంతయూ తగని విషయము (35) నీ హారమెక్కడ; ఆయన యొక్క నరకపాలములమాల యెక్కడ? నీ దివ్యమగు శరీరలేపనమెక్కడ? ఆయన శరీరమందలి చితాభస్మము ఎక్కడ? (36)

ఓ దేవీ! నీకు శివునకు రూపము మొదలగు వాటియందు సర్వమునందు విరోధము గలదు. కావున నాకీ వివాహము నచ్చుబాటు అగుటలేదు. నీకు తోచినట్లు చేయుము(37). నీవు ఈ సృష్టిలోని చెడు వస్తువుల నన్నిటినీ పొందగోరుచున్నావు. మనస్సును శివునినుండి మళ్ళించుము. లేనిచో, నీకు తోచినట్లు చేసుకొనుము(38)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ భ్రాహ్మణుని ఈ మాటలను విని మనస్సులో క్రోధమును పొందిన పార్వతి శివుని నిందించుటలో ఉత్సాహముగల బ్రాహ్మణునితో నిట్లనెను (39)

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో బ్రహ్మచారి మోసపు మాటలను వర్ణించే ఇరువది ఏడవ అద్యాయము ముగిసినది (27).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


11 Aug 2021

No comments:

Post a Comment