గీతోపనిషత్తు -243


🌹. గీతోపనిషత్తు -243 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 22-2

🍀 21-2. 'ఓం సత్యం పరం ధీమహి' - ఈ మొత్తము సృష్టికి మూలము సత్యము. అదియే పరము. దానిని ధ్యానించుట అనగా, అన్నిటి యందు దానిని దర్శించు చుండుటయే. సమస్తమునకు మూలమైన దానిని దర్శించెదను. సమస్తమునకు పరమై నిలబడిన సత్యమును దర్శించెదను. మూడు గుణములు, ఐదు భూతములుగ వ్యక్తమగు మూల ప్రకృతికి మూలమైన దానిని దర్శించెదను. ఇంతకు మించిన సర్వోత్తమ ధ్యానము లేదు. “ఓం సత్యం పరం ధీమహి" అనునది మూలమంత్రము. 🍀

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్య వ్యనన్యయా |
యస్యాన్తః స్థాని భూతాని యేన సర్వ మిదం తతమ్ || 22


తాత్పర్యము : పరము, సత్యము అగు తత్త్యమే విరాట్ పురుషునిగ, పరమ పురుషునిగ ఈ సమస్త జగత్తును వ్యాపించి యున్నది. అతనిని నిత్యము దర్శించు యత్నము సిద్ధించిననాడు అతనిని పొందవచ్చును.

వివరణము : ఈ మొత్తము సృష్టికి మూలము సత్యము. అదియే పరము. దానిని ధ్యానించుట అనగా, అన్నిటి యందు దానిని దర్శించు చుండుటయే. సమస్తమునకు మూలమైన దానిని దర్శించెదను. సమస్తమునకు పరమై నిలబడిన సత్యమును దర్శించెదను. మూడు గుణములు, ఐదు భూతములుగ వ్యక్తమగు మూల ప్రకృతికి మూలమైన దానిని దర్శించెదను. ఇంతకు మించిన సర్వోత్తమ ధ్యానము లేదు. “ఓం సత్యం పరం ధీమహి" అనునది మూలమంత్రము.

ప్రణవము ఆధారముగ పరమగు సత్యమును ధ్యానింతుము అనునది మత్స్య పురాణమున ఈయబడిన అష్టాక్షరీ మంత్రము. అనగా గాయత్రీ మంత్రము. దీనిని మనస్సున కనులు మూసుకొని స్మరించుటకన్న పరిసరములయందు చూచుట నిజమగు సాధన. సూటియగు సాధన. కనబడుచున్నది ఆవరణలతో కూడిన సత్యమే అయి యున్నపుడు దానిని దర్శించుటమాని, కనులు మూసుకొని ఊహించుట మాయ.

పరమే పరమ పురుషుడగు చున్నాడు. అనగా ప్రకృతి నిర్మించు సృష్టియందు ప్రవేశించి వ్యాపించి యున్నది. ఈ సృష్టి యంతయు అతని పురమే. పుర మేర్పడుటకు మూలమైనవాడు పురమందు పరిపూర్ణముగ వ్యాపించి యుండును. పురము నతిక్రమించి కూడ యుండును. పురము పురుషుని పట్టలేదు. పురుషుడు పురమందు వ్యాపించియున్నను, అంతకు మించి ఎంతయున్నదో ఎవ్వరికిని తెలియదు. అట్టి తత్త్వము అనన్యముగ దర్శించుటయే నిజమగు భక్తియని అర్జునునకు కృష్ణుడు బోధించు చున్నాడు. ఇతర మార్గము లన్నియు ఈ మార్గమును పట్టించినచో వానికి సార్థకత యుండును. లేనిచో చిల్లర మార్గములై తికమక పెట్టుచుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Aug 2021

No comments:

Post a Comment