🌹 . శ్రీ శివ మహా పురాణము - 442🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 28
🌻. శివుని సాక్షాత్కారము - 5 🌻
శివుడిట్లు పలికెను-
నన్ను విడిచి నీవు ఎచటకు పోయెదవు? నున్ను నేను రెండవసారి విడిచిపెట్టను. నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (43). ఈ ఆనాటి నుండి నేను నీ దాసుడను. నేను నీతపస్సులచే కొనివేయబడితిని. నీ సౌందర్యముచే కొనివేయబడితిని. నీవు లేని క్షణము యుగమువలె నున్నది (44).
నీవు సిగ్గును విడువుము. నీవు నా సనాతన ధర్మపత్నివి. ఓ గిరిజా!మహేశ్వరీ!నీవు సద్బుద్ధితో విచారించుము (45). దృఢమగు చిత్తము గలదానా! నేను నిన్ను పరిపరివిధముల పరీక్షించితిని. లోకలీలను అనుసరించే నా ఈ అపరాధమును మన్నించుము (46).
నీవంటి ప్రేమమూర్తి ముల్లోకములలో కానరాదు. నేను అన్ని విధములా నీకు అధీనుడనై యున్నాను. ఓ శివా! నీ కోర్కె నెరవేరుగాక! (47) ఓ ప్రియురాలా! నా వద్దకు రమ్ము. నీవు నాకు పత్నివి. నేను నీ వరుడను. నా నివాసమగు ఉత్తమకైలాసమునకు నేను నిన్ను దోడ్కొని తొందరలో వెళ్లగలను (48).
బ్రహ్మ ఇట్లు పలికెను-
దేవదేవుడు ఇట్లు పలుకగా ఆ పార్వతి చాల సంతసించెను. అంతవరకు ఆమె తపస్సును చేయుటలో పడిన క్లేశము మటుమాయమయ్యెను (49). ఓ మునిశ్రేష్ఠా! పార్వతీ దేవి యొక్క శ్రమ అంతయూ తొలగిపోయెను. మానవులకు చేసిన కష్టమునకు ఫలము లభించినప్పుడు అంతవరకు పడిన శ్రమ మటుమాయమగును (50).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతికి శివుడు దర్శనమిచ్చుట అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
21 Aug 2021
No comments:
Post a Comment