గీతోపనిషత్తు -245


🌹. గీతోపనిషత్తు -245 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 24-1

🍀 23-1. అపునరావృత్తి మార్గము - అంతర్ణ్యోతి సాన్నిధ్యమున లేక బహిర్ణ్యోతి సాన్నిధ్యమున దేహము విడుచుట అపునరావృత్తి మార్గమును బడయుటకు వీలగును. జ్యోతి సాన్నిధ్యము వలన ప్రకాశమావరించి యుండును. ప్రకాశమున్నచోట అజ్ఞాన మావరించు అవకాశ మున్నది. మాయా వరణమునకు ప్రకాశము విరుగుడు వంటిది. కనుక జ్యోతి సాన్నిధ్యమున దేహము విడుచుట బ్రహ్మవేత్తకు అనువగు కాలమై యున్నది. 🍀

అగ్ని ర్ణ్యోతి రహ శుక్ల షణ్మాపా ఉత్తరాయణమ్ |
తత్రప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24


తాత్పర్యము : అగ్ని, జ్యోతి, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణ పుణ్య కాలమునకు ఆరు నెలలు- ఈ కాలములందు దేహము త్యజించు బ్రహ్మవేత్తలు బ్రహ్మమును పొందుచున్నారు.

వివరణము : అగ్ని సాన్నిధ్యమున, జ్యోతి ప్రకాశము సాన్నిధ్యమున, పగటి యందు, శుక్లపక్షము నందు, అట్లే ఉత్తరాయణ కాలమునందు ప్రకాశ రూపమగు జ్ఞానము ఆవిష్కరింపబడి యుండును. వీని సమక్షమున ప్రజ్ఞకు ఊర్ధ్వగతి సహజము. బ్రహ్మవేత్తకు ఈ సమయము బ్రహ్మమును పొందుటకు అనుకూల ముగ నుండును. గాలివాటున ప్రయాణమువలె అనాయాస సిద్ధి కలుగును. కొందరు అహర్నిశలు అగ్నిసాన్నిధ్యముననే యుందురు. అట్టి వారిలో శిరిడిసాయి యొకరు.

అగ్నిసాన్నిధ్యము అంతర్ముఖముగ కూడ యుండవచ్చును. బహిర్ముఖమై యుండి తీరవలెనను శాసన మేమియు లేదు. నిరంతర స్మరణ వలన అంతరంగమున నిప్పు కణికవలె జీవించుచు, నివురుగప్పిన నిప్పువలె బాహ్యమున జీవించు సిద్ధులెందరో అప్రకటితముగ ప్రపంచమున వసించి యున్నారు. ఉదాహరణకు మాస్టర్ ఎం.ఎన్. అట్టివారు.

అట్లే అంతర్ణ్యోతి సాన్నిధ్యమున లేక బహిర్ణ్యోతి సాన్నిధ్యమున దేహము విడుచుట అపునరావృత్తి మార్గమును బడయుటకు వీలగును. జ్యోతి సాన్నిధ్యము వలన ప్రకాశమావరించి యుండును. ప్రకాశమున్న చోట జ్ఞాన మావరించు అవకాశ మున్నది. మాయా వరణమునకు ప్రకాశము విరుగుడు వంటిది. కనుక జ్యోతి సాన్నిధ్యమున దేహము విడుచుట బ్రహ్మవేత్తకు అనువగు కాలమై యున్నది.

పగలు ప్రకాశముండును. రాత్రి చీకటి యుండును. అందు వలన అహర్నిశలు జ్ఞాన, అజ్ఞానములకు ప్రతీకలు. వెలుగున్న సమయములో మరణించుట, చీకటి సమయములో మరణించుట కన్న ఉత్తమమని సూచించబడినది. శుక్లపక్షమందు చంద్రునికాంతి పెరుగుచు నుండును. కనుక శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి అంతము వరకు ఊర్ధ్వగతికి అనుకూలమగు కాలము. బ్రహ్మవేత్తలు ఇట్టి సమయమునే ఎంచుకొందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2021

No comments:

Post a Comment