🌹 . శ్రీ శివ మహా పురాణము - 445🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 29
🌻. శివపార్వతుల సంవాదము - 3 🌻
గ్రహములనగా నేమి? ఋతుసమూహములు ఏవి? నీ కంటె భిన్నముగా ఉపగ్రహములు గలవా? ఓ బ్రహ్మచారిణీ! నీవు శివుని కొరకు ఇప్పుడు తపస్సు చేయుచున్నావను మాట ఎట్టిది? (22) మనమిద్దరము భక్తుల యందలి ప్రేమతో నిండిన హృదయము గలవారమై ఈ జగత్తులో గుణభేధమును బట్టి విభిన్న కార్యరూపముగా సృష్ఠించి యున్నాము (23).
సూక్ష్మము, రజస్సత్త్వ తమో గుణాత్మకము, జగద్వ్యాపారమునందు సమర్థమైనది, నిర్గుణమైనదే అయిననూ నిత్యము, సగుణ రూపములో నుండునది అగు ప్రకృతి నీవే (24). ఓ సన్నని నడుము గల దానా! ఈ జగత్తులోని సర్వప్రాణులకు ఆత్మనేనే. వికారములు, కామనలు లేని నేను భక్తుల కోరిక మేరకు దేహమును స్వీకరించినాను (25).
ఓ పార్వతీ! నేను నీ తండ్రియగు హిమవంతుని వద్దకు వెళ్లను. మరియు నేను భిక్షుకుడనై నిన్ను ఇమ్మని ఎన్నటికీ యాచించను (26). ఓ పార్వతరాజ పుత్రీ ! మహాగుణశాలి, మహాత్ముడు, మమహాపురుషుడు అగు వ్యక్తి కూడా 'ఇమ్ము' అను మాటను పలికిన మరుక్షణములో తేలికయై పోవును (27).
ఓ కల్యాణీ! మంగళస్వరూపురాలా! ఈ విషయమును నీవెరుంగుదువు. ఇపుడు నీవు మాకు ఏమని చెప్పెదవు? నీ ఆజ్ఞ తప్పక అనుసరించ దగినదియే. కావున, నీకు ఎట్లు నచ్చినచో, అట్లు చేయుము (28).
బ్రహ్మ ఇట్లు పలికెను-
సాధ్వి, మహాదేవి, పద్మములు వంటి కన్నులు గలది అగు ఆమె ఈశ్వరుడు ఇట్లు చెప్పిననూ, భక్తితో అనేక పర్యాయములు సాష్టాంగపడి శంకరునితో నిట్లు పలికెను (29).
పార్వతి ఇట్లు పలికెను-
నీవు ఆత్మ, నేను ప్రకృతి అను విషయములో చర్చ లేదు. మనము స్వతంత్రులము; కాని భక్తుల అధీనములో నుండెదము నిర్గుణులము, సగుణులము కూడా (30). ఓ శంభో! ప్రభో! నేను చెప్పిన తీరున నీవీ పనిని ప్రయత్నపూర్వకముగా చేయవలసియున్నది. హే శంకరా! హిమవంతునికి ఈ భాగ్యమును కలిగించుము. నన్ను ఇమ్మని ఆయనను కోరుము (31). మహేశ్వరా! నాపై దయ చూపుము. నేను నీకు నిత్యభక్తురాలను. నాథా! నేను జన్మజన్మలయందు సర్వదా నీకు భార్యను (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
27 Aug 2021
No comments:
Post a Comment