గీతోపనిషత్తు -246


🌹. గీతోపనిషత్తు -246 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 24-2

🍀 23-2. అపునరావృత్తి మార్గము - బ్రహ్మవేత్త లనగ బ్రహ్మము నెరిగినవారు. వారు బ్రహ్మమే అయి యున్నవారు. వారు నిత్యము బ్రహ్మజ్ఞానమునందు ఉండుటచే బ్రహ్మపదముననే యున్నారు. అట్టివారు భగవత్ సంకల్పము నెరిగి జీవింతురు. వారి మరణము కూడ స్వచ్ఛందమే. వారు తిరిగి దేహములోనికి వచ్చుట జనకళ్యాణము కొరకే. తిరిగి వచ్చుటయా, రాకుండుటయా అనునది దైవేచ్ఛగ నెరిగి, తదను గుణముగ దేహత్యాగ కార్యక్రమమును నిర్వర్తింతురు. ఎంతటి బ్రహ్మవేత్తయైనను, బ్రహ్మ సంకల్పమున మరల జన్మింప వచ్చును. 🍀

24. అగ్ని ర్ణ్యోతి రహ శుక్ల షణ్మాపా ఉత్తరాయణమ్ |
తత్రప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24


తాత్పర్యము : అగ్ని, జ్యోతి, పగలు, శుక్ల పక్షము, ఉత్తరాయణ పుణ్య కాలమునకు ఆరు నెలలు- ఈ కాలములందు దేహము త్యజించు బ్రహ్మవేత్తలు బ్రహ్మమును పొందుచున్నారు.

వివరణము : మకర సంక్రమణము ( డిసెంబరు 22) నుండి కర్కాటక సంక్రమణము వరకు గల ఆరు మాసములు సూర్యుని ఉత్తర ముఖ ప్రయాణముగ తెలియనగును. మకరరేఖ నుండి భూమధ్య రేఖ మీదుగ కర్కాటకరేఖ వరకు ఉత్తరగతిని అనుసరించుచు సూర్యోదయము గోచరించును. ఈ ఆరు మాసములు ఉత్తరాయణ పుణ్యకాలముగ, ప్రకు వికాసము కలిగించు కాలముగ తెలియబడును. తిరిగి రాకుండు మార్గమున చనుటకై సంకల్పించు బ్రహ్మవేత్తలు ఈ కాలమున దేహము విడుతురని ప్రతీతి.

బ్రహ్మవేత్త లనగ బ్రహ్మము నెరిగినవారు. వారు బ్రహ్మమే అయి యున్నవారు. వారు నిత్యము బ్రహ్మజ్ఞానమునందు ఉండుటచే బ్రహ్మపదముననే యున్నారు. అట్టివారు భగవత్ సంకల్పము నెరిగి జీవింతురు. వారి మరణము కూడ స్వచ్ఛందమే. వారు తిరిగి దేహములోనికి వచ్చుట జనకళ్యాణము కొరకే. తిరిగి వచ్చుటయా, రాకుండుటయా అనునది దైవేచ్ఛగ నెరిగి, తదను గుణముగ దేహత్యాగ కార్యక్రమమును నిర్వర్తింతురు. ఎంతటి బ్రహ్మవేత్తయైనను, బ్రహ్మ సంకల్పమున మరల జన్మింప వచ్చును.

జన్మింపకుండుట కూడ యుండును. ఉదాహరణకు కర్దమ ప్రజాపతి పూర్వకల్పముననే అపునరావృత్తి మార్గమున బ్రహ్మమును చేరినను, ప్రస్తుత కల్పమున నారాయణ సంకల్పముగ ప్రజాపతిస్థానము నలంకరించి దివ్యపురుషులు దిగి వచ్చుటకై సహకరింతురు. బ్రహ్మమునందు తమ ప్రజ్ఞను స్థిరముగ నెలకొల్పుకొన్న బ్రహ్మవేత్తలు దేహము నందున్నను, లేకున్నను కూడ బ్రహ్మమునందే వసించి యుందురు.

అట్టి వారికి ఈ శ్లోకమున తెలిపిన సమయములు అనుకూల్యమునకే అని తెలియ వలెను. ఇతర జీవులకీ సమయములు ఉత్తర కాలమందు ఉత్తమ జన్మము నీయగలవు. అనగా జరిగిన జన్మకన్న కొంత మెరుగైన జన్మయని అర్ధము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Aug 2021

No comments:

Post a Comment