గీతోపనిషత్తు -252


🌹. గీతోపనిషత్తు -252 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 1-1

🍀 1. అనసూయత్వము-1 - అసూయ ఉన్న హృదయము నందు జ్ఞాన విజ్ఞానములు నిలువవు. లోపల, వెలుపల వశించియున్న దైవమును సమన్వయించి, దానిని మూలమును, ఏకత్వమును తెలియబరచుట ప్రారంభించినాడు. ఈ రెండింటి సమన్వయము అత్యంత గుహ్యము. కనుకనే గుహ్యతమము అను పదము వాడబడినది. అట్టి విషయమును తెలియవలె నన్నచో శ్రోత శ్రద్ధ, భక్తి, దీక్ష, ఏకాగ్రత, అప్రమత్తత, ఆర్ద్రత ఇత్యాది సద్గుణములతో పాటు, అసూయ లేనివాడై యుండ వలెను. 🍀


ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యా మ్యనసూయవే |
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ || 1

తాత్పర్యము : అత్యంత గుహ్యము, జ్ఞానవిజ్ఞాన సహితము అగు విషయమును అసూయ లేనివాడ వగుటచే నీకు పరిపూర్ణముగను, స్పష్టముగను తెలుపుచున్నాను. దీనిని తెలియుట వలన అశుభము నుండి మోక్షము పొందెదవు.

వివరణము : పరమాత్మ జీవుల పుణ్యవశాత్తు, పూర్ణముగ రూపు కట్టుకొనుటవలన శ్రీకృష్ణుడుగ గోచరించినాడు. పరిపూర్ణ జ్ఞానము తానే స్వయముగ బోధించినాడు. ఏడ (7)వ అధ్యాయమున సృష్టింపబడిన జగత్తు నందు దైవమును చూచు విధాన మంతయు తెలిపినాడు. ఎనిమిద(8)వ అధ్యాయమున అట్టి జగత్తున కాధారమైన, అక్షరము - పరము - బ్రహ్మము అయిన తత్త్వమును ఎట్లు పొందవలెనో స్పష్టముగ తెలిపినాడు. బహిరంగ అంతరంగములందు దైవముతో ఎట్లు యోగము చెందవచ్చునో తెలిపియున్నాడు. అనగా విజ్ఞానము, జ్ఞానము లేక బహిరంగము అంతరంగమందలి దైవమును తెలియు విధానమును తెలిపినాడు.

లోపల, వెలుపల వశించియున్న దైవమును సమన్వయించి, దానిని మూలమును, ఏకత్వమును తెలియబరచుట ప్రారంభించినాడు. ఈ రెండింటి సమన్వయము అత్యంత గుహ్యము. కనుకనే గుహ్యతమము అను పదము వాడబడినది. అట్టి విషయమును తెలియవలె నన్నచో శ్రోత శ్రద్ధ, భక్తి, దీక్ష, ఏకాగ్రత, అప్రమత్తత, ఆర్ద్రత ఇత్యాది సద్గుణములతో పాటు, అసూయ లేనివాడై యుండ వలెను. అసూయ ఉన్న హృదయమునందు జ్ఞాన విజ్ఞానములు నిలువవు. జ్ఞాన విజ్ఞానములే లేనపుడు వాని సమన్వయ మెట్లు నిలువగలదు?


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Sep 2021

No comments:

Post a Comment