గీతోపనిషత్తు -255


🌹. గీతోపనిషత్తు -255 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 2-2

🍀 2-2. రాజ రహస్యము - బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలోకూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. సత్యమెరిగిన వాని వద్ద సమస్త సృష్టి మిత్రత్వము వహించి యుండును. అట్టివాని నెవ్వరును జయింపలేరు. తాను శాశ్వతుడనని తెలియజేయు విద్య అత్యంత శ్రేష్ఠమైన విద్య. కనుక దానిని రాజవిద్య అనిరి. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. తెలిపినను మరుగున పడునది, మర్చి పోవునది నిజమగు రాజ రహస్యము. 🍀


రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్ || 2

తాత్పర్యము : శాశ్వతము, అవ్యయము, అక్షరము, సమస్తమున కతీతము అగు సత్యము లేక బ్రహ్మమును తెలియ జేయు విద్య విద్యలలో ఉత్తమోత్తమమైనది. కనుక అది రాజ విద్య. ఈ రాజవిద్య రహస్యములలో కూడ ఉత్తమోత్తమ రహస్యము. ఇది అత్యంత పవిత్రము. ప్రత్యక్షముగ దీనిని తెలియవచ్చును. ఇది తెలిసినవాడు సహజముగనే ధర్మమున వర్తించును. ద్వంద్వా తీతమగు సుఖము ననుభవించును. కనుక దీని ననుష్ఠించుట కర్తవ్యమై యున్నది.

వివరణము : నిజమగు రాజ రహస్యము ఎన్నిమార్లు తెలిపినను మరల రహస్యమై పోవుచుండును. అదెట్లనిన “నీవు చూచు జీవియందు, ప్రకృతి యందు ఈశ్వరుడున్నాడు. అందరి హృదయము లందు ఈశ్వరుడున్నాడు. కనుక ఈశ్వరుని దర్శించు" అని ఎన్నిమార్లు తెలిపినను సాధకులు జీవులను ప్రకృతినే చూతురుగాని, అందలి ఈశ్వరుని చూడరు. చూచుట మరతురు. "అన్నము బ్రహ్మ"మని తెలిపినను అన్నమునే చూతురు. బ్రహ్మమును చూడరు. “అంతయు బ్రహ్మమే" అని తెలిపినను బ్రహ్మము తప్ప ఇతరము చూతురు.

“నేను కాని దేమియు లేదు” అని ఎన్నిమార్లు తెలిపినను అన్యమును చూతురు గాని అనన్యత్వమును దర్శింపరు. విచిత్ర మేమనగ ఎన్నిమార్లు జ్ఞప్తి చేసినను మరుక్షణమే రహస్యమై పోవును. తెలుపకుండుట వలన రహస్యమునకు తావున్నది. తెలిపినను రహస్యమై పోవుట అత్యాశ్చర్యము కదా! కనుక భగవానుడు దీనిని నిజమగు రాజరహస్య మనిరి.

విచిత్రమేమనగ సత్యమును ప్రత్యక్షముగ తెలియవచ్చును. చూచునది, వినునది, రుచి చూచినది, వాసన చూచినది జీవుడు తాను అనుకొనును. కాని తనయందలి ఈశ్వరు డాధారముగ చూచుట, వినుట, రుచిచూచుట ఇత్యాదివి అనుభవించు చున్నాడు. తన యందలి సత్యమాధారముగనే ప్రత్యక్షానుభవము కలుగుచుండును. జీవునిలో శివుడున్నప్పుడే జీవుని కన్ని అనుభవములు. శివుడే లేనిచో శవమే మిగులును. శవమున కెట్టి అనుభూతియు లేదు. అట్లే చూడబడు సమస్త జీవులయందు, ప్రకృతి యందు సత్యముండును. సత్యమే శివము, సుందరము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Sep 2021

No comments:

Post a Comment