మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 83


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 83 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 సాధన- సమిష్టి జీవనము - 4 🌻


సాధకులు ఆత్మవంచనకు పాల్పడరాదు. తాము తప్పు చేస్తే, ఎవరు చెప్పినా సర్దుకోవడానికి సిద్ధమయితే తమకే మంచిది. ఎవరు చెప్పారని కాదు, ఏమి చెప్పారనేది ముఖ్యము. అంతేకాని, తమ తప్పు తెలిసి కూడ, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇతరులపై తప్పురుద్దటం మానుకోవాలి.

అసలు‌ సంగతేమిటంటే, ఒక వ్యవహారంలో ఏంచేయాలి అనే అంశం ఎన్నివేల మంది సాధకులు కూర్చుండి గురువును ప్రార్థించినా ఒకటే సమాధానం తట్టుతుంది, సమర్పణ ఉంటే, సమిష్టి జీవన ప్రాధాన్యాన్ని గూర్చి కేకలు వేస్తూ, నినాదాలు ఇచ్చేవారు‌ గూడ తద్భిన్నంగా వర్తిస్తుంటారు.

తోటి సాధకులతో గలసి పనిచేయాలంటే, ఒక్కోసారి అనేక మనోవికారాలు అడ్డు వస్తుంటాయి. తోటివారు ఎంతటి గుణసంపన్నులు, సేవానిమగ్నులు, పరిశుద్ధలయినా‌సరే, తమ కన్న పాండిత్యంలో, విజ్ఞానంలో లేదా సమాజంలో,‌ ప్రసిద్ధిలో, వయస్సులో, కులములో తక్కువవారనే‌ భావంతో‌ వారితో‌ కలిసి‌ పనిచేయాడానికి‌ అతిశయం‌ అడ్డువస్తూ‌ ఉంటుంది. తమ అతిశయాన్ని వెల్లడించలేక, అవతలివారి యందు దోషాలను ఎన్నడమూ జరుగుతూ ఉంటుంది.

ఇంకా కొందరు తమ ఇంట్లో పూజలు, కార్యక్రమాలు జరిగినపుడు‌ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొంటారు. తోటి సాధకుల ఇండ్లలో అవి ఏర్పాటయితే నీరుగారి పోతారు, యాంత్రికంగా పాల్గొంటారు లేదా అసలు పాల్గొనరు.

తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది..

....✍️ మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


19 Sep 2021

No comments:

Post a Comment