గీతోపనిషత్తు -257
🌹. గీతోపనిషత్తు -257 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 3-1
🍀 3-1. చక్రవ్యూహము - చక్రవ్యూహమునబడి జన్మముల తరబడి అవే పనులు చేయుచు తిరుగాడు దీనస్థితిలో మానవజాతి యున్నది. పురోగతి లేదు. రంగుల రాట్నమెక్కిన వానికి ఎంత సమయము దానిపై తిరిగినను తల తిరుగుటయే గాని పురోగమన ముండదు. తినినవే తినుచు, మాటాడినవే మాటాడుచు, వినినవే వినుచు, చూచినవే చూచుచు, పుట్టిన చోటనే పుట్టుచు యుండుటకు కారణము తన ధర్మము తనకు తెలియకపోవుటయే. తన ధర్మము తనకు తెలియవలెను. దానిని స్వధర్మ మందురు. తన ధర్మము తనకు తెలియనిచో నశించుట తప్పదు. 🍀
అశ్రద్ధధానా: పురుషా ధర్మ ప్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్మని || 3
తాత్పర్యము : ధర్మమునందు శ్రద్ధలేని పురుషులు నన్ను పొందలేరు. అట్టివారు మృత్యువే పర్యవసానమగు సంసారము నందు వర్తించుచు నుందురు.
వివరణము : చేసిన పనులే చేయుచు, చివరికి మరణించుచు, మరల పుట్టుచు, మరల అవే పనులు చేయుచు, మరల మరణించుచు వర్తులాకారముగ తీరుబడి లేక జన్మ లెత్తుచున్నటు వంటి మానవులు అనేక సంఖ్యాకు లున్నారు. అందుకే మానవ చరిత్ర యందు పూర్వము జరిగిన ఘట్టములే మరల మరల జరుగుచు నుండును. బలవంతులు బలహీనులను కొల్లగొట్టుట, దురాక్రమణములు చేయుట, యుద్ధములు చేయుట, ఒకరినొకరు చంపుకొనుట, దోచుకొనుట నేటికిని కొనసాగుచునే యున్నది.
ఇట్టి చక్రవ్యూహమునబడి జన్మముల తరబడి అవే పనులు చేయుచు తిరుగాడు దీనస్థితిలో మానవజాతి యున్నది. పురోగతి లేదు. రంగుల రాట్నమెక్కిన వానికి ఎంత సమయము దానిపై తిరిగినను తల తిరుగుటయే గాని పురోగమన ముండదు. తినినవే తినుచు, మాటాడినవే మాటాడుచు, వినినవే వినుచు, చూచినవే చూచుచు, పుట్టిన చోటనే పుట్టుచు యుండుటకు కారణము తన ధర్మము తనకు తెలియకపోవుటయే. తన ధర్మము తనకు తెలియవలెను. దానిని స్వధర్మ మందురు. తన ధర్మము తనకు తెలియనిచో నశించుట తప్పదు. పరధర్మ మాచరించినచో పతనము మరియు మనుజుడు అధోగతికి దారితీయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment