శ్రీ శివ మహా పురాణము - 456


🌹 . శ్రీ శివ మహా పురాణము - 456🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 31

🌻. శివ మాయ - 5 🌻


నీవు ఈ పద్మము వంటి దివ్యమైన శ్రేష్ఠరూపము మంచి లక్షణములు గల నీ కుమార్తెను శివునకు ఈయగోరుచున్నావని నాకు తెలిసినది (43). శివుడు ఆశ్రయము లేనివాడు, సంగవిహీనుడు, కురూపి, గుణహీనుడు, శ్మశానమునందు నివసించువాడు. ఆతని శరీరమును పాములు చుట్టుకొని యుండును. ఆయన యోగి (44).

దిక్కులే వస్త్రముగా గలవాడు, చెడు రూపము గలవాడు, పాములను ఆభరణములుగా ధరించువాడు, కులనామముల నెరుంగనివాడు, చెడు శీలము గలవాడు, విహారము నెరుంగనివాడు (45), విభూతి లేపనముతో గూడిన దేహము గలవాడు, క్రోధస్వభావుడుర, వివేకము లేనివాడు, వయస్సు నెరుంగని వాడు, సర్వదా చిక్కు బడిన జటలను ధరించువాడు (46),

సర్వమును ఆశ్రయించి తిరుగువాడు, పాములు హారముగా గలవాడు, భిక్షుకుడు, చెడు మార్గమునందు ప్రీతి గలవాడు, దురహంకారముచే వేదమార్గమును వీడినవాడు (47) అగు శివునకు పార్వతి నీయవలెననే నీ ఈ బుద్ధి మంగళదాయకము కాదు సుమా! హే పర్వతరాజా! నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు. నారాయణుని కులమునందు జన్మించినవాడవు. తెలుసుకొనుము (48).

నీవుపార్వతిని దానము చేయుటకు తగిన పాత్ర ఆయన కాదు. ఈ విషయమును విన్నంతనే మహాజనులు నవ్వెదరు (49). ఓ పర్వతరాజా! గమనించుము. ఆయనకు బంధువు ఒక్కడైననూలేడు. నీవు మహారత్నములకు నిధివి. ఆయన వద్ద ధనము లవమైననూ లేదు (50).

ఓ పర్వత రాజా! బంధువులను, మేనకను, కుమారులను, మరియు ఇతరులనందరినీ శ్రధ్ధతో అడిగి చూడుము. పండితులను కూడ ప్రశ్నించుము. కానీ పార్వతిని ప్రశ్నించవద్దు (51). ఓ పర్వతరాజా! ఏనాడైననూ రోగికి మందు రుచించదు. రోగికి అన్ని వేళలా మహాదోషకరమగు చెడు పథ్యము బాగుగా రుచించును (52).

ఆ బ్రాహ్మణుడిట్లు పలికి ఆనందముగా భుజించి శీఘ్రమే నిర్గమించెను. అనేక లీలలను ప్రదర్శించు శివుడు శాంతముగా తన ధామమునకు చేరుకొనెను (53).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతి ఖండలో శివమాయావర్ణమనే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Sep 2021

No comments:

Post a Comment