శ్రీ శివ మహా పురాణము - 449
🌹 . శ్రీ శివ మహా పురాణము - 449🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 30
🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 3 🌻
నృత్యగాన పండితుడగు శివుడు ఎర్రని వస్త్రమును ధరించి ఎడమచేతియందు కొమ్ము బూరాను, కుడిచేతియందు డమరుకను, భుజముపై మచ్చల దుప్పటిని ధరించి యుండెను (27). అపుడా మహానటుని రూపములో నున్న శివుడు మేనక మరియు ఇతర స్త్రీల యెదుట ప్రాంగణములో చక్కని నాట్యమును చేసి, అతిమనోహరముగా అనేకములగు పాటలను పాడును (28).
మరియు ఆయన అచట చక్కని ధ్వని గల కొమ్ముబూరాను, డమరును మ్రెగించి వివిధములైన మనోహర మహానాట్యములను చేసెను (29). ఆనాట్యమును చూచుటకై నగర జనులు అందరు, అనగా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరు, వెంటనే అచటకు విచ్చేసిరి (30).
ఓ మహర్షీ! ఆ చక్కని గీతమును, మనోహరమగు నృత్యమును చూచి మేనతో సహాఅందరు మోహమును పొందిరి (31). ఆ దుర్గకూడ మూర్ఛిల్లి హృదయమునందు శంకరుని చూచెను. త్రిశూలము మొదలగు చిహ్నములను ధరించియున్నవాడు. మిక్కలి సుందరాకారుడు (32).
భస్మచే అలంకరింప బడినవాడు, సుందరమగు ఎముకల మాలను ధరించినవాడు, మూడు కన్నులతో గొప్పగా ప్రకాశించు చున్న ముఖము గలవాడు, సర్పములే యజ్ఞోపవీతముగా గలవాడు (33), వరమును కోరుకొనుము అని పలికిన వాడు, పచ్చని రంగు గలవాడు, మహేశ్వరుడు, దీనులకు బంధువు, దయాసముద్రుడు, అన్ని విధములుగా మిక్కలి మనోహరమైనవాడు (34), హృదయము నందున్నవాడు అగు హరుని చూచి ఆమె ఆతనికి నమస్కరించెను. మరియు ఆమె తన మనస్సులో 'నీవు నాకు భర్తవు కమ్ము' అని వరమును గోరెను (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
07 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment