✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 8-1
🍀 8. ప్రకృతి మాయ -1 - జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమే గాని, నిజమునకు జీవులు అవశులు. 🍀
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ || 8
తాత్పర్యము : ప్రాణి సముదాయ మంతయు స్వతహ ప్రకృతిచే నియమింపబడువారు అగుటచే నిశ్చయముగ అవశులు. అనగ తమ వశమున తాముండలేరు. ప్రకృతి ఎట్లాడించిన, అట్లాడుదురు.
వివరణము : జీవులు పుట్టుట, పెరుగుట, హాని వృద్ధులను పొందుట, కష్టనష్టములకు గురియగుట ఇత్యాదివన్నియు ప్రకృతి వశమున నుండును గాని జీవుల వశమున ఏమియు నుండదు. మాయ వలన, మోహము వలన తమ వశమునకై ప్రయత్నము చేయుట జరుగుచుండును. తన వశమున నున్నట్లు గోచరించినది గూడ కాలక్రమమున తన వశము తప్పును.
యౌవనమున వశమున నున్న దేహము వార్ధక్యము రాగానే వశము తప్పును. వస్తువులు, మనుషులు, సంపదలు తమచుట్టు చేరుట, వదలి పోవుట జీవితములందు గోచరించుచునే యుండును. అంతయు ప్రకృతి ఆధారముగనే, స్వామిత్వముననే జరుగు చుండును. కాని మోహము చెందినవాడు తనవలననే ఇట్లు జరిగినది, అట్లు జరిగినది అని భావించి మాయామోహమున పడును.
సరస్సున నీరు నిండినపుడు, అట్లు నీరు నింపు కొన్నది సరస్సు కాదు. నీరే చేరినది. చేరిన నీరు ఇంకిపోవచ్చును, ఎండిపోవచ్చును లేక వుండవచ్చును. కారణము సరస్సు కాదు. నీరు చేరినపుడు కప్పలు చేరును. నీరు లేనపుడు కప్పలు వలసపోవును. ఈ మొత్తము వ్యాపారము నందు సరస్సు కర్తృత్వ మేమియు లేదు. అట్లే మానవ జీవితము కూడ. కర్తృత్వ మున్నట్లు మానవునకు గోచరించునే కాని నిజమునకు లేదు. బాగుగ విచారించినచో తన నుండి, పరిసరముల నుండి జరుగుచున్న జీవ వ్యాపారమంతయు ప్రకృతి విలాసమేగాని, నిజమునకు జీవులు అవశులు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Oct 2021
No comments:
Post a Comment