శ్రీ శివ మహా పురాణము - 465

🌹 . శ్రీ శివ మహా పురాణము - 465🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఋషులు ఆ మాటను విని ఆ హిమవంతుడు నవ్వి కొద్దిగా భయపడినవాడై గొప్ప వినయమును చూపుచూ ఇట్లు పలికెను (23).

హిమవంతుడిట్లు పలికెను -

మహారాజునకు ఉండదగిన సామగ్రి ఏదియూ శివుని వద్ద గానరాదు. ఆయనకు ఒక ఆశ్రయముగాని, ఐశ్వర్యముగాని, తన వారుగాని, బంధువులు గాని ఉన్నట్లు కన్పట్టుట లేదు (24). మిక్కిలి నిర్లిప్తుడగు యోగికి నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయుట నాకు ఇష్టమగుట లేదు. వేదములను ప్రవర్తిల్ల చేసిన బ్రహ్మ గారి పుత్రులగు మీరు మీ నిశ్చయమును చెప్పుడు (25). కామనలవలన గాని, మోహము వలన గాని, భయము వలనగాని, లోభము వలన గాని కుమార్తెను తగని వరునకు ఇచ్చిన తండ్రి నశించి నరకమును పొందును (26). నేను ఇష్టపడి శూలపాణియగు శివునకు కన్యను ఈయలేకున్నాను. ఓ ఋషులారా! ఈ విషయములో ఎట్లు యోగ్యముగ నుండునో మీరే నిర్ణయించుడు (27).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! హిమవంతుని ఆ మాటను విని వారిలో వాక్య విశారదుడగు వసిష్ఠుడు ఈ విధముగా బదులిడెను (28).

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! నీకు అన్ని విధములుగా హితమును కలిగించునది, ధర్మమునకు విరుద్ధము కానిది, సత్యము, ఇహపరములలో ఆనందమును కలిగించునది అగు నా మాటను వినుము (29). ఓ పర్వతరాజా! లోకమునందు, వేదమునందు గూడ వచనము మూడు విధములుగా నున్నది. శాస్త్రము నెరింగిన జ్ఞానులు శుద్ధమగు జ్ఞాననేత్రముచే ఈ సర్వమును ఎరుంగుదురు (30). అసత్యము వర్తమానములో వినుటకు మధురముగ నుండి భవిష్యత్తులో కష్టమును కలిగించును. శత్రువు బుద్ధి మంతుడైనచో హితమును ఎన్నడైననూ పలుకడు (31). దయాళువు, ధర్మ బుద్ధి గలవాడు అగు బాంధవుడు ఆదిలో క్లేశమును కలిగించునది, పరిణామములో సుఖమును కలిగించునది అగు మాటను పలుకును (32).

వినుటకు అమృతము వంటిది, సర్వకాలముల యందు సుఖమును కలిగించునది, సత్యము యొక్క సారముతో గూడినది, హితమును కలిగించునది అగు వచనము శ్రేష్ఠుమని పెద్దలు చెప్పెదరు (33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


25 Oct 2021

No comments:

Post a Comment