శ్రీ శివ మహా పురాణము - 462


🌹 . శ్రీ శివ మహా పురాణము - 462🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 6 🌻


హిమవంతుడిట్లు పలికెను -

సూర్యుని వలె వెలుగొందు ఈ ఏడ్గురు నా వద్దకు వచ్చుచున్నారు. నేనీ మహర్షులకు ఇప్పుడ శ్రద్ధగా పూజను చేయవలెను (56). ఇట్టి మహాత్ములు ఎవరి ఇంటికి విచ్చేయుదురో, అట్టి గృహస్థులగు మనము ధన్యులము. వీరు అందరికీ సుఖమునిచ్చెదరు (57).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలోనే ఆకాశమునుండి భూమిపైకి దిగి ఎదురుగా నిలబడిన ఆ ఋషులను చూచి హిమవంతుడు సన్మాన పూర్వకముగా ఎదురేగెను (58). చేతులు జోడించి తలను వంచి ఆయన సప్తర్షులకు నమస్కరించి వారికి బహుమాన పూర్వకముగా పూజను చేసెను (59). హితమును చేయు ఆ సప్తర్షులు పర్వతరాజగు హిమవంతుని పట్టుకొని ప్రసన్నమగు ముఖముగలవారై మంగళములకు నిలయములగు వచనములను పలికిరి (60).

వారిని ముందిడుకొని హిమవంతుడు 'నా గృహస్థాశ్రమము ధన్యమైనది' అని పలికి వారికి భక్తి పురస్సరముగా ఆసనమును సమర్పించెను (61). తేజో మూర్తులగు ఆ మునులు ఆసనములందు కూర్చున్న వారై ఆజ్ఞాపించగా, హిమవంతుడు తాను నిలబడియున్నవాడై ఇట్లు పలికెను (62).

హిమవంతుడిట్లు పలికెను-

నేను ధన్యుడను. కృతకృత్యుడను. నా జీవితము సఫలమైనది. ప్రజలు నన్ను అనేక తీర్థములతో సమానముగా భావించి దర్శించెదరు (63). ఏలయనగా, విష్ణుస్వరూపులగు మీరు నా గృహమునకు విచ్చేసితిరి. పూర్ణులగు మీకు దీనులగు గృహస్థుల గృహములలో కార్యము ఏమి ఉండును? (64) అయిననూ, దయచేసి సేవకుడునగు నాకు తగిన ఏదో ఒక పనిని చెప్పుడు. నా జన్మ సఫలము కాగలదు (65).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు సప్తర్షుల రాకను వర్ణించే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


19 Oct 2021

No comments:

Post a Comment