గీతోపనిషత్తు -270
🌹. గీతోపనిషత్తు -270 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 10
🍀 10. ఈశ్వర సన్నిధానము - ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరాను సంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి. 🍀
మయా ధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌంతేయ జగ ద్విపరివర్తతే || 10
తాత్పర్యము : నా అధ్యక్షతయందు ఈ సమస్త చరాచర సృష్టిని ప్రకృతి అల్లుచు నున్నది. ప్రకృతి కారణముగనే జగత్తు పరివర్తించు చున్నది.
వివరణము : జగత్తనగా జరుగుచు, సాగుచు నుండునది. అది యంతయు ఈశ్వరాధీనమై యున్నది. ఈశ్వరుడు అధ్యక్షుడుగ జగత్తు పరివర్తనము చెందుచు నుండును. జగత్తునకు ప్రత్యేక అస్థిత్వము లేదు. అది ఈశ్వరుని ఆశ్రయించి యుండును. ప్రకృతి తనకు తానుగ జడము. అనగ ఏమియు చేయలేదు. కాని ఈశ్వర సాన్నిధ్యమున సర్వము నిర్వర్తించును. సూర్యకాంతి లేనిదే జీవుల వ్యాపార మేమియు లేదు. జీవులకు సూర్యకాంతి వలె ప్రకృతికి పరమాత్మ ఆధారము. సూదంటురాయి సన్నిధానమందు ఇనుప రజను కదిలినట్లు ఈశ్వర సాన్నిధ్యముననే ప్రకృతి నిత్య పరివర్తనమున నున్న జగత్తును సృష్టించి, నడిపించుచున్నది. ప్రకృతియే అధ్యక్ష స్థానము నందున్నట్లుండును. కాని అవ్యక్తముగ ప్రకృతిని నడిపించుచున్న దీశ్వరుడే. ఈశ్వరుని బలముననే ప్రకృతి వర్తనము, నర్తనము కూడ. అట్లే జీవుల వర్తనము, నర్తనము కూడ.
జగద్వర్తనమునకు, జీవుల వర్తనమునకు కారణము ప్రకృతి. కాని ప్రకృతికి ఆధారము ఈశ్వరుడు. దీనిని బాగుగ ఆకళింపు చేసుకొన వలెను. మన ప్రకృతి మనలను వర్తింపజేయు చుండును. ఎవరి ప్రకృతి ప్రకారము వారు వర్తింతురు. కాని వారికిని, వారి ప్రకృతికిని కూడ ఈశ్వరుడే ఆధారము. మన యందు సాన్నిధ్యము నిచ్చిన ఈశ్వరుని వలననే మన ప్రజా ప్రాణములు, మనము వర్తించు చున్నాము. మన ప్రవర్తనలకు ఈశ్వరుడు బాధ్యుడు కాదు. మనమే బాధ్యులము. మన యందలి ప్రకృతిని మనము ధర్మసమ్మతముగ, జ్ఞాన సమ్మతముగ సర్దుబాట్లు చేసుకొన్నచో మనకు జీవితమున ప్రశాంతత, ఆనందము కలుగుటయే గాక, మన యందలి ఈశ్వర సన్నిధానమును చవి చూడవచ్చును. అపుడు మనము, మన ప్రవర్తనము ఈశ్వరానుసంధానమున యుండుటకు వీలగును. అట్టి అనుసంధానమే మోక్ష స్థితి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment