శ్రీ శివ మహా పురాణము - 469
🌹 . శ్రీ శివ మహా పురాణము - 469 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 34
🌻. అనరణ్యుడు - 1 🌻
వసిష్ఠుడిట్లు పలికెను |
ఇంద్ర సావర్ణి అను పేరు గల పదునాల్గవ మనువు యొక్క వంశములో అనరణ్యుడను చక్రవర్తి జన్మించెను (1). అనరణ్య మహారాజు ఏడు ద్వీపములతో గూడిన భూమండలమునకు ప్రభువు. మంగళారణ్యము నందు జన్మించిన బలశాలియగు ఆ మహారాజు ప్రత్యేకించి శివభక్తుడు (2).ఆయన భృగువును పురోహితునిగా చేసుకొని వంద యజ్ఞములను చేసెను. కాని దేవతలు ఇచ్చిననూ ఆయన ఇంద్ర పదవిని స్వీకరించలేదు (3). ఓ హిమాలయా! ఆ మహారాజునకు వందమంది కుమారలు ఉండిరి. మరియు పద్మయను పేరు గల లక్ష్మీ సమానురాలైన ఒక సుందరియగు కన్య ఉండెను (4).
ఆ మహారాజునకు వందమంది పుత్రలపై ఎంత ప్రేమ గలదో, అంతకంటె అధిక ప్రేమ ఆ కన్య యందు ఉండెడిది. ఓ పర్వతరాజా! (5) ఆ మహారాజునకు ప్రాణములకంటె అధికముగా ప్రియమైనవారు, సర్వసౌభాగ్యములతో గూడినవారు అగు అయిదుగురు భార్యలు ఉండిరి (6). ఆ కన్య తన తండ్రి ఇంటిలో పెరిగి ¸°వనములో అడుగిడెను. ఆ రాజు మంచి వరులను రప్పించుటకై పత్రములను పంపించెను (7). ఒకనాడు పిప్పలాదమహర్షి తన ఆశ్రమమునకు వెళ్లు తొందరలో నుండి నిర్జనమగు తపోవనములో ఒక గంధర్వుని చూచెను (8).
స్త్రీలతో గూడి శృంగారరసముద్రములో మునిగిన మనస్సు గలవాడై మహాప్రేమతో విహరించుచున్న కామశాస్త్ర కోవిదుడగు (9) ఆ గంధర్వుని చూచి ఆ మహర్షి కామము గలవాడాయెను. ఆయన మనస్సును తపస్సునందు లగ్నము చేయజాలక వివాహమాడవలెనని తలపోసెను (10). ఈ తీరున కామముచే పీడింపబడిన మనస్సుగల ఆ పిప్పలాద మహర్షి కొంతకాలమును గడిపెను (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
03 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment