గీతోపనిషత్తు -279
🌹. గీతోపనిషత్తు -279 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 13-3
🍀 13-3. ఈశ్వర తత్వము - మూల చైతన్యము యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును. మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును. 🍀
మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13
తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.
వివరణము : సమస్త జీవులయందు నిత్యము నర్తన చేయుచున్నటు వంటి చైతన్యమునకు ఆధారమై యున్న నిశ్చల చైతన్యము దర్శింప వీలగును. నిజమున కదియే లేకున్నచో జీవుల కథయే లేదు. జీవుల కథ లేనపుడు కూడ అది యుండును. అది మూల చైతన్యము. దాని యందే సృష్టి కథయంతయు భూత, వర్తమాన, భవిష్యత్తుగ సాగుచుండును. సమస్త జీవుల, గ్రహగోళముల, మండలముల కదలికలకు ఆధారమై, కదలక నిత్యముగను, శాశ్వతముగను యున్న మూల చైతన్యమును దర్శించినపుడు, ఉన్నది ఒకటే యనియు, అది అనేకానేకములుగ నర్తించుచున్న దనియు, అది శాశ్వతమనియు తెలియవచ్చును.
అట్లు తెలిసిన వెనుక దానినే సమస్త జీవుల మూలముగ దర్శించుట జరుగును. అట్టి దర్శనము లభ్యమై నపుడు, ఇక ఇతరముల దర్శనము మరుగున పడును. ఇట్టి మూల చైతన్యము దర్శించుటకు సత్వగుణము ఆధారము. అట్టి సత్వగుణము లభించుటకు కర్తవ్యకర్మ, సుగుణముల ఉపాసన ఆధారము. ఇట్టి మార్గమున ప్రవేశించి కృషి చేయుటవలన కామిని, మోహిని, ఆసురి అగు అజ్ఞానము నశించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment