శ్రీ శివ మహా పురాణము - 478


🌹 . శ్రీ శివ మహా పురాణము - 478 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 6 🌻

వసిష్ఠుడిట్లు పలికెను-

ఓ పర్వతరాజా! ఇట్లు పలికి ఆ ధర్ముడు నిలబడి యుండెను. ఆమె ఆతనికి ప్రదక్షిణము చేసి నమస్కరించి తన గృహమునకు వెళ్లెను (52). ధర్మడు ఆమెకు ఆ విధముగా ఆశీర్వచనములను పలికి తన గృహమునకు వెళ్లెను. మరియు ఆతడు ప్రతిసభయందు ఆమెను ప్రీతితో కొనియాడెను (53). ఆమె యువకుడగు తన భర్తతో కలిసి నిరంతరముగా ఏకాంతమునందు రమించెను. తరువాత ఆమెకు తన భర్తకంటె అధికగుణవంతులగు పుత్రులు కలిగిరి (54). సర్వానందములను వృద్ధిపొందించి ఇహపరములయందు సుఖశాంతులను కలిగించు సంపదలన్నియు ఆ దంపతులకు లభించెను (55).

ఓ శైలరాజా! నీకీ పురాతనమగు ఇతిహాసమును సంపూర్ణముగా చెప్పితిని. నీవు ఆ దంపతుల చరితమును ప్రీతితో మహాదరముతో వింటివి (56). నీవు సత్యము నెరింగి నీకుమార్తెయగు పార్వతిని శివునకు ఇమ్ము. ఓ పర్వతరాజా! నీవు, నీభార్యయగు మేన చెడుదియగు రోషమును విడిచిపెట్టుడు (57). ఏడు రోజుల తరువాత, లభింప శక్యము కానిది, మిక్కిలి శుభ##మైనది అగు ముహూర్తములో లగ్నాధిపుడగు చంద్రుడు తన కుమారునితో గూడి లగ్నమునందుండి (58) ఆనందముతో రోహిణితో కలిసియుండగా, చంద్రుడు నక్షత్రములు స్వచ్ఛముగా ప్రకాశించుచుండగా, ఏ దోషములైననూ లేని మార్గశీర్షమాసములో సోమవారమునాడు వివాహమును చేయుము (59).

మంచి గ్రహములన్నింటితో కూడియున్నది, చెడు గ్రహముల దృష్టి లేనిది, మంచి సంతాన యోగము కలది, భర్త జీవించి యుండు సౌభాగ్యమును ఇచ్చునది అగు ముహూర్తమునందు (60) జగన్మాత, మూల ప్రకృతి, ఈశ్వరి, కన్య అగు పార్వతిని జగత్పితకు ఇచ్చి వివాహమును చేయుము. ఓ పర్వతరాజా! ఇట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మునిశ్రేష్ఠుడు, జ్ఞానులలో ఉత్తముడు అగు వసిష్ఠుడు ఇట్లు పలికి, అనేక లీలలను ప్రదర్శించే శివప్రభుని స్మరించి విరమించెను (62).

శ్రి శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండంలో పద్మాపిప్పలాదుల చరిత్రయను ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


21 Nov 2021

No comments:

Post a Comment